కరోనా నియంత్రణపై మరింత అప్రమత్తం..
Ens Balu
2
Srikakulam
2021-01-04 19:42:27
కరోనా నియంత్రణపై మరింత అప్రమత్తతతో వుండవలసిన ఆవశ్యకత వుందని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం జె.సి.క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నియంత్రణపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా 50 రోజుల కేంపెయిన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదన్నారు. డిశంబరు ఒకటవ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు 50 రోజులు కేంపెయిన్ కార్యక్రమాన్ని అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. సానిటైజరు వుపయోగించాలని, సామాజిక దూరం పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని ఇంటింటికీ వెళ్ళి ప్రజలకు తెలియ చేయాలన్నారు. పండుగ సందర్భంగా మరింత అప్రమత్తతతో వుండాలని వారికి తెలిపాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్, వైద్య సిబ్బంది, వాలంటీర్లతో సహా అందరూ మంచి సేవలను అందించడం వలన మన జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
ప్రభుత్వం కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా అడ్డుకోవడానికి 50 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వయంశక్తి సంఘాలు, ఉపాధిహామీ సిబ్బంది, ఆర్.టి.సి. ఎండోమెంట్స్, ఎం.డి.ఓ.లు, సెక్రటరీలు, మున్సిపల్ కమీషనర్లు కార్యక్రమంపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలన్నారు. గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను కాంపెయన్ నిర్వహించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని తెలిపారు. సెకెండ్ వేవ్ ప్రబల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగించి ప్రతీ ఒక్కరూ కరోనా పూర్తి నివారణకు సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతి, జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. లక్ష్మీపతి, ప్రజా రవాణా శాఖ డిప్యూటీ సి.టి.ఎం. జి.వరలక్ష్మి, తదితర అధికారులు హాజరైనారు.