సంక్షిప్త ఓటరు జాబితాలు తయారు చేయండి..
Ens Balu
3
Kakinada
2021-01-04 19:54:21
ప్రత్యేక సంక్షిప్త సవరణ-2021 కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన, వాస్తవికతను ప్రతిబింబించే ఓటరు జాబితాలను రూపొందించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయ్ కుమార్ ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలను కోరారు. జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ గా నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన కమీషనర్ అండ్ డైరక్టర్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయ్ కుమార్ సోమవారం జిల్లాలో జరిపిన పర్యటనలో భాగంగా సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్, ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ-2021 ప్రక్రియ జరుగుతున్న తీరును సమీక్షించారు. కార్యక్రమంలో తొలుత జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల కమీషన్ నిర్థేశించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ప్రత్యేక సంక్షిప్త సవరణ-2021 క్రింద ముసాయిదా జాబితాల ప్రచురణ, అందిన క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలను ఆయనకు వివరించారు.
నవంబరు 16వ తేదీన ప్రచురించిన ముసాయిదా జాబితాల ప్రకారం జిల్లాలోని 19 నియోజక వర్గాలలో గల 4597 పోలింగ్ స్టేషన్ల పరిధిలో, మొత్తం 42,71,956 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 21,11,772 మంది పురుషలు, 21,59,829 మంది మహిళలు, 355 మంది ఇతరులు ఉన్నారని డిఆర్ఓ తెలిపారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 742 మంది ఓటర్ల నిష్పత్తి ఉండగా, లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు, 1023 మంది మహిళలుగా ఉందని తెలియజేశారు. ముసాయిదా జాబితాలపై మొత్తం 48,660 క్లెయిములు,అభ్యంతరాలు అందగా, వీటిలో 35,938 ధరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించడం జరిగందని, మిగిలిన వాటిన్నిటినీ మంగళవారం నాటికి గడువులోపున ఈఆర్ఓలు పరిష్కరిస్తారన్నారు. జిల్లాలోని 4597 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల కమీషన్ నిర్థేశించిన కనీస సదుపాయాలను కల్పించడం జరిగిందని, వీటి మాపింగ్ పూర్తి చేసి వెబ్ సైట్లో అప్ లోడ్ చేశామన్నారు. అనంతరం రోల్ అబ్జర్వర్ విజయకుమార్ సమీక్ష నిర్వహిస్తూ జిల్లా ఓటరు జాబితాల్లో నమోదైన జనాభా-ఓటర్ల నిష్పత్తి, ఓటర్లలో స్త్రి-పురుష నిష్పత్తి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
రంపచోడవరం నియోజక వర్గంలో తక్కవగా ఉన్న జనాభా-ఓటరు నిష్పత్తి జిల్లా సగటు కంటే బాగా తక్కవగా ఉందని, ఓటరు నమోదు మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈఆర్ఓ కు సూచించారు. అలాగే పిఠాపురం, ముమ్మిడివరం, అమలాపురం నియోజక వర్గాలలో తక్కవగా ఉన్న లింగ నిష్పత్తి సవరణకు ఆయా ఈఆర్ఓలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జిల్లా జనాభాలోని 18 నుండి 19 ఏళ్ల వయస్సు యువత అందరూ ఓటర్లుగా నమోదైయ్యేట్లు ప్రోత్సహించారు , ఈ నెల 25వ తేదీన నిర్వహించే ఓటరు దినోత్సవ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక చైతన్యాన్ని జాగృత చేయాలని సూచించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు, ముఖ్యంగా దివ్యాంగ ఓటర్ల కొరకు అవసరమైన సదుపాయాలు ఉండేలా పర్యవేక్షించాలన్నారు. సంక్షిప్త సవరణ-2021 కార్యక్రమంలో అందిన క్లెయిమ్లు, అభ్యంతరాన్నిటిని 5వ తేదీలోగా పూర్తి చేసి, స్వచ్చమైన ఓటరు జాబితాలను సిద్దం చేయాలని అబ్జర్వర్ విజయ్ కుమార్ ఈఆర్ఓలను కోరారు. అధికారులతో సమీక్షకు ముందు రోల్ అబ్జర్వర్ విజయ్ కుమార్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటరు జాబితాల సవరణకు, స్వచ్చీకరణకు అందరి సహకారాన్ని కోరారు. అలాగే వివిధ పార్టీల ప్రతినిధులు చేసిన సూచనలను స్వీకరించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. సవరణ ప్రక్రియ జరుగుతున్న తీరు పట్ల అన్ని పార్టీలు సంతృప్తి వ్యక్తం చేయాయి. జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి మాట్లాడుతూ రోల్ అబ్జర్వర్ సూచించిన అంశాలపై ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) బి.రాజకుమారి, సబ్ కలెక్టర్లు హిమాంశు కౌశిక్, అనుపమ అంజలి, ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆర్.వెంకటేశ్వరావు (వైఎస్ఆర్ సిపి), జి.సాయిబాబు (టిడిపి), జి.జి.కళ్యాణ కుమార్ (బిజేపి), పి.అర్జున్ (ఐ.ఎన్.సి), సిహె.అజయ్ కుమార్ (సిపియం), ఎస్.అప్పారావు (బిఎస్పి) తదితరులు పాల్గొన్నారు.