7నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తికావాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-01-04 20:24:09

పేదలందరికీ ఇల్లు పథకం లో జిల్లావ్యాప్తంగా  మంజూరు చేసిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి 7వ తేదీ నాటికి నూరు శాతం పంపిణీ పూర్తి కావాలన్నారు. లబ్ధిదారులయిన ప్రతి మహిళకు ఆమెకు కేటాయించిన భూమిని చూపి, దానికి సంబంధించిన పట్టా అందించాలన్నారు. పట్టా తో పాటు ముఖ్యమంత్రి లేఖను,  స్థలం సరిహద్దులను చూపించి, ఇల్లు మంజూరు పత్రాలను తప్పక అందజేయాలన్నారు.  ఇళ్ల మంజూరు పత్రం అందజేసిన లబ్ధిదారు  సొంత స్థలంలో తీయించుకున్న ఫోటో తప్పనిసరిగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లబ్ధిదారులకు ఫోన్ కాల్ వచ్చే సమయానికి వారు పట్టా, స్థలం ఇంటి మంజూరు పత్రాలు అందుకుని, గృహ నిర్మాణ ఆప్షన్  ఇచ్చి ఉండాలన్నారు.  జిల్లాలో ఉన్న లబ్ధిదారులందరికీ  గ్రామ వాలంటీర్ల చేత పత్రాలన్నింటినీ వేగంగా సరఫరా చేయించాలన్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పంపిణీ కార్యక్రమాన్ని తాసిల్దార్లు,  నియోజకవర్గ ప్రత్యేక అధికార్లు ప్రతిరోజు సమీక్షించాలన్నారు.   8వ తేదీ నుంచి థర్డ్ పార్టీ తనిఖీ ఉండవచ్చని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.  విశాఖ నగర పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించ బోయే ఇళ్ల స్థలాలను ఏకమొత్తంగా చూపించే ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ కమిషనర్ ను ఆదేశించారు. నగరంలోని లబ్ధిదారులు అందరికీ ఇంటి పట్టా అందించి నిర్మాణపు ఆప్షన్లను తీసుకోవాలన్నారు.  అలసత్వం వహించిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ జి. సృజన, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్, డిఆర్డిఏ పిడి వి.విశ్వేశ్వరరావు, యు సి డి పి డి శ్రీనివాస్, ఆర్ డి వో లు పెంచల కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివ జ్యోతి, ప్రత్యేక ఉప కలెక్టర్లు సూర్య కళ, పద్మలత, అనిత గృహ నిర్మాణ శాఖ, టిడ్కో ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.