సొంతింటితోనే జీవితానికి పరిపూర్ణ భద్రత..
Ens Balu
4
Kakinada
2021-01-04 20:40:16
కరోనా కష్టకాలంలోనూ వెనకడుగు వేయక సంక్షేమానికి సంబంధించి చెప్పిన ప్రతి మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కరప మండలంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కన్నబాబు ప్రారంభించారు. తొలుత జెడ్.భావారంలో రూ.349 లక్షల అంచనా విలువతో చేపట్టే 194 గృహ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. దాదాపు 500 ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. వైస్సార్ రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, వైస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా
తదితర ఎన్నో సంక్షేమ పథకాల అమలు జరుగుతోందన్నారు. దైనందిన జీవిత అవసరాలకు సంబంధించి మహిళలు ఇబ్బంది పడకూడదన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలు ప్రారంభించారన్నారు. ఇళ్ల స్థలాలను అన్ని హక్కులతో మహిళలకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, అయితే దీనిపై కొందరు కేసులు వేయడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నామని, సమస్య సమసిపోయాక రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 30 వేల ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాలకు సమీపంలో లేఔట్లను అభివృద్ధి చేసి, ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని.. దీనివల్ల ఆయా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. పేదలకు పరిపూర్ణ భద్రతను కల్పించే సొంత ఇంటి కలను ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని సంక్షేమ పథకాలను లబ్దిదారుల ముందుకు చేర్చే వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి తనకు కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానట్లు మంత్రి పేర్కొన్నారు. జెడ్. భావారం పర్యటన అనంతరం మంత్రి కన్నబాబు.. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ తో కలిసి వాకాడ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ. 80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే సీసీ రోడ్, బీటీ అప్రోచ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఓసీ కాలనీలో సీసీ ప్రధాన డ్రైన్లను ప్రారంభించారు. బాబూ జగ్జీవన్‌రామ్ కమ్యూనిటీ హాల్‌కు ప్రారంభోత్సవం చేశారు. డా. బీఆర్ అంబేద్కర్ రాజ్యగృహ నిర్మాణాలను కూడా ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు గ్రామ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. శ్రీ సూర్య పవన్ తేజ ఫంక్షన్ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఇచ్చిన మాట కంటే ఎక్కువే కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కన్నబాబు చేపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కరప ఎంపీడీవో కె.స్వప్న, తహసీల్దార్ సీహెచ్ ఉదయ్ భాస్కర్, స్థానిక నేతలు, అధికారులు హాజరయ్యారు.