రాష్ట్రంలో దుష్ట శక్తులు అలజడి రేపుతున్నాయి..


Ens Balu
2
Srikakulam
2021-01-05 11:20:44

రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు అలజడి సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. మంగళవారం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంత్రి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ, కొందరికి దేవుడి పట్ల భయం, భక్తి లేవు. ఓట్ల కోసం తప్ప.. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం వారికి రాదు.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ప్రజలను మభ్య పెట్టడానికే వరుసగా దేవలయాలు, దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని ప్రజలు మరిచిపోతున్నారనే భయం,  ఆందోళన తోనే ఈ విధంగా ఈ ఆందోళనలన్నీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్  జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే  కుట్రలు పన్నుతున్నారని మండి పడ్డారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారు ఎవరనేది ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్న మంత్రి అన్ని విషయాలు నిగ్గుతేలుతాయన్నారు.  వచ్చే నెలలో అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలను నిర్వహిస్తామని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం కల్పిస్తామని. ఆలయాల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు ప్రత్యేక మర్యాదలతో దర్శన ఏర్పాట్లను చేసిన ఈఓ పుష్పనాధం చేయగా, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకశర్మ ఆశీర్వచనాలు అందజేశారు. స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.