అర్హులందరికీ వైఎస్సార్ భీమా పథకం..
Ens Balu
2
Vizianagaram
2021-01-05 12:47:51
అర్హులందరికీ వైఎస్ఆర్ బీమా పథకాన్ని వర్తింపజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆదేశించారు. పేద కుటుంబాలకు బీమా ద్వారా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ బీమా పథకం సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ బీమా పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేసేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 7వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే చివరిరోజు వరకూ వేచిఉండకుండా, వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిఆర్‌డిఏ, మెప్మా సిబ్బంది తక్షణమే కార్యాచరణను ప్రారంభించాలని ఆదేశించారు. వీరంతా అర్హులనుంచి దరఖాస్తులను తీసుకొని, గడువు లోగా బ్యాంకులకు అందజేయాలని సూచించారు. అలాగే ఆగిపోయిన బ్యాంకు ఖాతాలను పునరుద్దరించడం, సంతకాల్లో తేడాలను సరిచేయడం తదితర పనులను కూడా పూర్తి చేయాలన్నారు. ఇలా సమర్పించిన దరఖాస్తులను బ్యాంకులు ఈనెల 21లోగా పరిశీలించి, వారందరికీ వైఎస్ఆర్ బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని కలెక్టర్ అన్నారు. వైఎస్ఆర్ బీమా పథకం అమల్లో 58శాతం పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలోనే మన జిల్లా ఇప్పటికే నెంబరు 1 స్థానంలో ఉందని, దానిని నిలబెట్టుకోవడమే కాకుండా, శతశాతం పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.
ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు, డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు, మెప్మా పిడి కె.సుగుణాకరరావు, ఎల్‌డిఎం శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకు అధికారులు, వెలుగు, మెప్మా అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.