కరోనా-19 జాగ్రత్తలు పాటించాల్సిందే..


Ens Balu
2
RTC COMPLEX
2021-01-05 15:17:31

ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. కోవిడ్ ప్రవర్తనా నియమావళి కార్యక్రమంపై మంగళ వారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్ పలు అంశాలను వివరించారు. కోవిడ్ వాక్సిన్ త్వరలో అందుబాటులో వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ కోవిడ్ సమయంలో ప్రజలు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళిపై ప్రభుత్వ సూచించిన మేరకు కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీల కమీషనర్లు, స్వచ్చంద సంస్ధలు, మండల, గ్రామ స్ధాయి కార్యక్రమాలు, విద్యాసంస్ధలు, వైద్య సంస్ధలు, రవాణా రంగంలో ఉన్నవారు, నైపుణ్య శిక్షణ, మతాధిపతులు, పర్యాటక తదితర అన్ని రంగాల వ్యక్తులతోను, అన్ని శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన చెప్పారు. జనవరి 19వ తేదీ వరకు 50 రోజుల కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలని, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రపరచుకోవడం చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.  జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిందనే అపోహలో ఉండవద్దని ఆయన సూచించారు. ఇప్పటికి తీవ్రంగా ఉండే కేసులు నమోదు అవుతున్నాయని గుర్తించాలని తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు వేడుకలు నిర్వహించుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు పంటలు వచ్చే కాలమని పంటల విక్రయ సమయంలోనూ, ఇతర సమయాల్లోనూ జాగ్రత్తలు వహించాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికి ప్రజలకు మూడవ దశలో ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాక్సిన రెండు డోసులు తీసుకోవలసి ఉంటుందని అప్పటి వరకు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు : కోవిడ్ వాక్సిన్ ను మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు అందించడం జరుగుతుందని కలెక్టర్ నివాస్ చెప్పారు. ఇప్పటి వరకు 20,838 మంది హెల్త్ కేర్ వర్కర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. 105 ప్రదేశాల్లో వాక్సిన్ ను నిల్వ ఉంచుటకు ఏర్పాట్లు చేసామని ఆయన చెప్పారు. రెండవ దశలో మునిసిపల్, పంచాయతీ పారిశుధ్య కార్మికులు, పోలీసులు తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు అనంతరం 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, 50 సంవత్సరాలు పైబడిన వారికి తదితర 30 శాతం మందికి వాక్సిన ఇవ్వడం జరుగుతుందని వివరించారు. వాక్సిన్ ను పొందుటకు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. జనవరి 2వ తేదీన డ్రైరన్ ను జిల్లాలో విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ చెప్పారు.       ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతీ కుమారీ దేవి తదితరులు పాల్గొన్నారు.