20లోగా పట్టాల పంపిణీ పూర్తికావాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-01-05 18:19:44

ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ, ఇళ్ల నిర్మాణం, ఎన్ఆర్ఇజియస్, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, డా. వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్ లు(గ్రామీణ), అంగన్ వాడీ, నాడు – నేడు స్కూల్స్, రహదారులు మరియు భవనాల శాఖకు సంబంధించి భూ సేకరణ సమస్యలు, రెండవ విడత అమ్మ ఒడి పథకం ప్రారంభం, రేషన్ డోర్ డెలివరీ వెహికల్ లాంచ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థల పట్టాలు అందాల న్నారు.. దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి మంజూరు చేయడం వరకు నిరంతర ప్రక్రియని, పారదర్శకంగా నిర్వహించాలన్నారు.   ప్రతి పెండింగ్ దరఖాస్తును పరిశీలించాలని, ఈ పరిశీలన కార్యక్రమం అనేది ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు.  లే ఔట్ లలో మౌళిక సదుపాయలైన  అంగన్ వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాల్ లు, పార్క్ లు, రహదారులు, తాగునీరు, విద్యుత్, తదితర వాటిని ఇళ్ల నిర్మాణాలు అయ్యేలోగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ టిడ్కో గృహాలకు సంబంధించి ప్రింటెడ్ సేల్ ఎగ్రిమెంట్ ప్రతులు ఈ రోజు అందుతాయని, రేపటి నుండి పంపిణీ గావిస్తామన్నారు.  ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ కార్యక్రమం జిల్లా అంతటా ముమ్మరముగా జరుగుతుందని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు.  పెంచిన గడువు ఈ నెల 20వ తేదీలోగా పట్టాలు పంపిణీ పూర్తి అవుతుందని  పేర్కొన్నారు.  ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బి. కృష్ణారావు, జివియంసి కమీషనర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్ పి. శ్రీనివాసరావు, డ్వామా ప్రాజెక్టు డైరక్టర్ సందీప్, పంచాయితీ రాజ్ ఎస్ఇ సుధాకర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి, సర్వశిక్ష అభియాన్ పిఒ మల్లిఖార్జున రెడ్డి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పిడి సీతామహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.