గుడులు, ప్రార్ధనా స్థలాల్లో నిఘా ఉంచండి..
Ens Balu
2
Bondapalli
2021-01-05 18:23:54
విజయనగరం జిల్లాలోని మారుమూల గ్రామాలు, నిర్జన ప్రదేశాల్లో వుండే గుళ్లు, ప్రార్ధనా స్థలాలపై నిఘా వుంచాలని అక్కడి వెళ్లి వచ్చేవారిని కనిపెట్టి వుండాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బొండపల్లి మండలం గొట్లాంలోని గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ తమ పరిధిలో వుండే ప్రార్ధన స్థలాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ప్రార్దనా స్థలాల నిర్వహణను చూసే అర్చకులు, పూజారులను కూడా అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా ప్రాచీన దేవాలయాలపై ఒక కన్నేసి వుంచాలన్నారు. సచివాలయంలో రిజిష్టర్ల నిర్వహణ, ప్రభుత్వ పథకాలపై పోస్టర్ల ప్రదర్శన వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించారు. సచివాలయ పరిధిలో ఇ-సేవలకు వచ్చిన దరఖాస్తులు ఏవీ పెండింగులో లేకపోవడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. వై.ఎస్.ఆర్.బీమా అమలులో బ్యాంకర్ల సహకారం తదితర అంశాలపై సంక్షేమ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఫించన్ల పంపిణీ గురించి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటూ గ్రామస్థుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో క్రియాశీలకంగా వుండాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో మొక్కల పెంపకంపై పెద్ద ఎత్తున అవగాహన కలిగించడంతో పాటు సిబ్బంది కూడా భాగస్వాములై ప్రజలతో మొక్కలు నాటించాలన్నారు. ప్లాస్టిక్ విచ్చలవిడిగా వినియోగించకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించేలా వారిలో అవగాహన కలిగించాలని చెప్పారు.