భారత్ పర్వ్ లో అనంత మార్కు..


Ens Balu
2
Anantapur
2021-01-05 18:50:09

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26-31ల మధ్య జరుపుకునే భారత్ పర్వ్ వేడుకలను కరోనాను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం డిజిటల్ వేదికపై నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. కేంద్ర టూరిజం సెక్రెటరీ యోగేంద్ర త్రిపాఠీ ఆధ్వర్యంలో కాన్ఫరెన్సు నిర్వహణ జరిగింది. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ ఏడాది డిజిటల్ వేదికగా జరిగే భారత్ పర్వ్ వేడుకలలో జిల్లా మార్కు కనిపించేలా చూడాలని జిల్లా పర్యాటక శాఖను అదేశించారు. తెలుగు జాతికి తనదైన సాంస్కృతిక వారసత్వాన్ని అందించిన జిల్లా సంస్కృతి చాటిచెప్పేలా ఛాయా చిత్రాలు, వీడియోలను చిత్రీకరించాలన్నారు. ఆహారం, ఆహార్యం, ఆధ్యాత్మికం, పర్యాటకం, నాటకం, నాట్యం, శిల్పం వంటి సాంస్కృతిక వైవిధ్యాలను ప్రతిబింబిస్తూ వీడియోలు, ఫోటోల చిత్రీకరణ జరగాలన్నారు. డిజిటల్ 'భారత్ పర్వ్' వేడుకలను ఒక అవకాశంగా మలుచుకుని జిల్లా సంస్కృతిని ఆధునిక మాధ్యమంలో ఒడిసిపట్టి రానున్న తరాలకు అందించాలన్నారు.  భారత్ పర్వ్ వేడుకల కోసం కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక వెబ్ సైట్ ను తయారు చేసి రాష్ట్రాలకు అందుబాటులో ఉంచనుంది. వాటిల్లో రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతిని ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. ఇదే అదనుగా జిల్లా ప్రత్యేకతను దేశ వ్యాప్తంగా మరోసారి చాటి చెప్పాలని కలెక్టర్ టూరిజం శాఖను ఆదేశించారు. కాన్ఫరెన్సులో జిల్లా పర్యాటక శాఖ ప్రాంతీయ మరియు కార్యనిర్వాహక సంచాలకులు బి.ఈశ్వరయ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి పీవీ దీపక్ లు పాల్గొన్నారు.