దోమతెరలను సద్వినియోగం చేసుకోవాలి..
Ens Balu
1
Nakkavanipalem
2021-01-05 19:53:03
మన పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలబారి నుంచి రక్షణ పొందవచ్చునని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అన్నారు. మంగళవారం రెండవ జోన్ లో నక్కవానిపాలెంలోని వివేకానంద కళ్యాణ మండపంలో సుమారు 300 దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 1.60లక్షల దోమతెరలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వాటిని జిల్లా మలేరియా విభాగం ద్వారా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. గతంలో పంపిణీ చేపట్టిన విధంగానే, జివిఎంసి పరిధిలోని 18 వార్డులలో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పంపిణీ జరుగుతుందన్నారు. అంతే కాకుండా, వసతి గ్రుహాల్లో కూడా దోమతెరలు పంపిణీ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ దోమతెరలు, ఒక ప్రత్యేకమైన రసాయనాలతో తయారుచేయబడినవని, దోమలు వీటిపై వాలిన వెంటనే చనిపోతాయన్నారు. దోమ తెరలు వాడే విధానంపై ప్రజలకు సిబ్బంది అవగాహన కల్పించారు. జివిఎంసి పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది చాలావరకు డెంగ్యూ, మలేరియా వ్యాధులు తగ్గాయని ప్రజలు నీటినిల్వలు కొబ్బరి చిప్పలలో, పాత సీసాలలో లేకుండా చూడాలని తద్వారా మలేరియా అరికట్టవచ్చనని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అసిస్టెంట్ డైరెక్టరు కె.వి.ఎస్. ప్రసాద్, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బయాలజిస్ట్ పైడి రాజు, ఇతర మలేరియా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.