8కి.మీ లోపల రింగు వలలతో చేపల వేట నిషేధం..


Ens Balu
2
Visakhapatnam
2021-01-05 19:58:44

సముద్రంలో తీరం నుండి 8 కి.మీ. లోపల రింగులవలతో వేట నిషేధమని మత్స్యశాఖ మంత్రి సీదరి అప్పలరాజు తెలిపారు.  మంగళవారం సర్క్యూట్ హౌస్ లో రెండు వర్గాల మత్స్యకారులతో రింగులవలలు వాడకంపై ఆయన పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి సమావేశం ఏర్పాటు చేశారు. మోటారు బోట్ల వారు, సాంప్రదాయక బోట్ల మత్స్యకారులతో చర్చించిన తరువాత ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు లైసెన్సు కలిగిన వారు 8కి.మీ.లు దాటిన తరువాత చేపల వేట కొనసాగించ వచ్చని, కొత్తగా లైసెన్సులు జారీ చేయబడవని తెలిపారు.  చట్టం ముందు అందరూ సమానమే నని, సాంప్రదాయ మత్స్యకారుల జీవన భృతిని కాపాడేందుకు, మత్స్యసంపదతో పాటు తీర ప్రాంత పర్యావరణ రక్షణకు ఇటువంటి చర్య అనివార్యమని చెప్పారు. నియమనిబంధనలను  రూపొందించి కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. మత్స్యకారుల వివరాలను సేకరించవలసినదిగా డైరెక్టరు కె.కన్నబాబును మంత్రి ఆదేశించారు. నిబందనలు రాష్ట్రవ్యాప్తంగా అమలు లోనికి వస్తాయన్నారు. దీని మూలంగా తీరంలో పెరిగే చిన్న చేపలు, చేపపిల్లలు రక్షింపబడతాయని, సముద్రం లోని పర్యావరణం (నమ్మ)కు హాని జరగదని పేర్కొన్నారు.  మేథావులు, మత్స్యకార సంఘాలు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకుని పూర్తి స్థాయి చట్టంగా రూపొందించడం జరిగిందన్నారు. ఈ నిర్ణయం మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూడా తోడ్పడుతుందన్నారు.  గతంలో వుండే బల్లవల, అలివల, ఎరవల (లైటింగ్ ఎరవేసి పట్టడం) మొదలైన వాటిని నిషేదించడం జరిగిందని గుర్తు చేశారు.  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి మత్స్యకారులంటే ఎంతో అభిమానమని చెప్పారు.  మత్స్యకారులందరూ సమైక్యంగా వుంటారని, చూసి ఓర్వలేని శక్తులు తగవులు పెడుతున్నారన్నారు.  ప్రపంచంలో 30 శాతం దేశాల ఆర్ధిక వ్యవస్థ చేపల వేటపైనే ఆధారపడి వుందని ఆయన గుర్తుచేశారు.  దక్షిణ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ  రింగుల వలను  కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు నిషేదించాయని చెప్పారు.  బోట్లకు లైసెన్స్ లు జారీ చేసే సమయంలోనే ఎటువంటి వలలు వాడాలో నిర్ణయించి వుంటుందని  తెలిపారు.  కాబట్టి నిర్ణయానికి అందరూ కట్టుబడి వుండాలన్నారు.  అంతకు ముందు రింగులవలతో వేట సాగించే మోటారు బోట్ల వారు, సాంప్రదాయ బోట్లతో వేట సాగించే వారు తమ వాదనలు వినిపించారు.  రింగులవలతో వేట వలన ఎక్కువ మత్స్య సంపద చేజిక్కినా, దీర్ఝకాలంలో ఎంతో నష్టం జరుగుతుందని, సాంప్రదాయ మత్స్యకారుల జీవన భృతి పోతుందని కొందరు తెలియజేయగా ఆధునిక యంత్రాల సాయంతో లాభాల బాటన వేట సాగిస్తే అభివృద్ధి సాద్యమవుతుందని  వాదించారు. కోలా గురువులు  లగుడుపల్లి కొండబాబు, తాతాజీ, గురుమూర్తి, శివశంకర్, రామారావు,  తదితరులు మాట్లాడారు.   ఈ సమావేశంలో మత్స్యశాఖ సంచాలకులు కె.కన్నబాబు,  జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టరు ఎమ్.వేణుగోపాల రెడ్డి,  మత్స్యశాఖ జె.డి. ఫణిప్రకాష్, డిడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.