కోవిడ్ వేక్సినేషన్ కు సమాయత్తం కావాలి..
Ens Balu
3
Vizianagaram
2021-01-08 11:57:14
కోవిడ్ వేక్సినేషన్‌కు సమాయాత్తం కావాలని వైద్యారోగ్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆదేశించారు. స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వేక్సినేషన్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బంది పనివిధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేక్సినేషన్ ప్రక్రియ త్వరలో మొదలు కానుందని, దీనికి అన్నివిధాలా సిబ్బంది సంసిద్దంగా ఉండాలని అన్నారు. మొదటిదశ వేక్సినేషన్‌కు 89 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందని, వాటిలో అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన పరికరాలు, మందులతోపాటు, శిక్షణ పొందిన నిపుణులను కూడా సిద్దం చేయాల్సి ఉందన్నారు. మానవ వనరుల కొరత రాకుండా, అదనంగా మరికొందరికి శిక్షణ ఇచ్చి సిద్దంగా ఉంచాలన్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితి ఎదురైతే, దానిని తట్టుకొనేందుకు వీలుగా అన్నివిధాలుగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. సాంకేతికపరమైన సమస్యలు ఎదురైన పక్షంలో, ప్రత్యామ్నాయాలను కూడా ఇప్పటినుంచే అన్వేషించాలన్నారు. వైద్యారోగ్యశాఖ, 108, 104 సిబ్బందికి సైతం శిక్షణ ఇచ్చి సంసిద్దులను చేయాలని, ఈ మేరకు తక్షణమే వారికి ఉత్తర్వులను జారీ చేయాలని ఆదేశించారు. వాక్సినేషన్‌లో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ సంబంధించిన జాబ్‌చార్ట్‌ను తయారు చేయాలని సూచించారు. భారీ ఎత్తున జరిగే కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియ ఎంతో విభిన్నమైదని, దీనిని ఎంతో అప్రమత్తంగా, అంకితభావంతో పూర్తిచేయాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, అదనపు వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్.రామ్మోహనరావు, డిఐఓ డాక్టర్ నారాయణ, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.