కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
1
East Godavari
2021-01-08 15:25:04
తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో నిపుణులైన వైద్య బృందాలతో అత్యవసర వైద్య కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శుక్రవారం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కాకినాడ జీజీహెచ్‌లో డ్రైరన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ పర్యవేక్షించారు. లబ్ధిదారుల డేటా నమోదు, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్ రూం తదితరాలను క్షుణ్నంగా పరిశీలించారు. అత్యవసర వైద్య సేవలకు అందుబాటులో ఉంచిన మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో దశల వారీగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో యంత్రాంగం సన్నద్ధతను అంచనా వేసేందుకు శుక్రవారం మరోసారి డ్రైరన్ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. వాస్తవ పరిస్థితుల్లో టీకా వేసే ప్రక్రియలో ఎలాంటి సమస్యా ఎదురుకాకుండా ఉండేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలోనూ అత్యవసర వైద్య సేవలు, మందులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎం.రాఘవేంద్రరావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మొద్దని సూచించారు. టీకా వేయించుకొని.. మీతో పాటు మీ కుటుంబాన్ని తద్వారా దేశాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలన్నారు. టీకాతో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవన్నారు. ఒకవేళ వస్తే పదివేల మందిలో ఒకరికి దద్దుర్లు వంటివి వచ్చే అవకాశముందన్నారు. ఏవైనా దుష్పరిణామాలు ఎదురైతే తక్షణమే స్పందించేందుకు వీలుగా నిపుణులైన అత్యవసర వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. కలెక్టర్ ఆదేశాలతో జీజీహెచ్‌లో మరో రెండు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు రాఘవేంద్రరావు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ గిరిధర్, కోవిడ్-19 కేంద్ర ఇన్‌ఛార్జ్ డాక్టర్ గంగా భవాణి తదితరులు పాల్గొన్నారు.