భూగర్భ జలవనరుల మదింపు..
Ens Balu
1
Kakinada
2021-01-08 15:26:42
తూర్పుగోదావరి జిల్లాలోని భూగర్భ జలవనరులకు సంబంధించి పునఃమదింపు నివేదికను రూపొందించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో వివిధ విభాగాలు కచ్చితత్వంతో కూడిన సమాచారం అందించాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వర్చ్యువల్ విధానంలో కలెక్టర్ అధ్యక్షతన భూగర్భ జలవనరుల అంచనా జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. జల వనరులు, ఈపీడీసీఎల్, ప్రణాళిక, వ్యవసాయం, ఉద్యానవన, డ్వామా, అటవీ, గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్, ప్రజారోగ్యం, పరిశ్రమలు, మత్స్య విభాగాలు సమాచారాన్ని నిర్దేశ ఫార్మాట్‌లో భూగర్భ జల, జల గణన శాఖకు అందించాలని కలెక్టర్ సూచించారు. భూగర్భ జలవనరుల అంచనాల మదింపు ప్రక్రియ సాధారణంగా మూడేళ్లకు ఓసారి జరగుతుందని, ఇప్పటివరకు ఆరుసార్లు 1999-2000, 2004-05, 2007-08, 2010-11, 2012-13, 2016-17లకు సంబంధించి జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 2019-20కు సంబంధించి అంచనాల రూపకల్పనకు కసరత్తు జరుగుతోందని, జిల్లా స్థాయి అంచనాలను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించాల్సి ఉంటుందన్నారు. 2004-05లో జరిగిన సర్వే ప్రకారం జిల్లాలో 32 గ్రామాల్లో అత్యధిక భూగర్భ జలాల వినియోగం (Over Exploited) జరిగిందని, ఈ సంఖ్య 2016-17 సర్వేలో 12గా నమోదైనట్లు తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీరు తదితరాలకు సంబంధించి ప్రణాళికల రూపకల్పనకు, ఇష్టానుసారం భూగర్భ జలాలను ఉపయోగించకుండా నియంత్రించడం వంటి వాటికి ఈ నివేదికలు ఉపయోగపడతాయని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి వివరించారు. రీఛార్జ్ కంటే ఎక్కువగా డిశ్చార్జ్ కాకుండా చూసుకునేందుకు భూగర్భ జల వనరుల నివేదికలు ఉపయోగపడతాయని భూగర్భ జల, జల గణన శాఖ ఉప సంచాలకులు పీఎస్ విజయ్‌కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 28లోగా జిల్లా నుంచి అంచనాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందన్నారు. సమావేశంలో 12 విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.