ఉన్నత విద్యలో ప్రవేశాలు పెరగాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-01-08 21:11:43
ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే వారి సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర అన్నారు. శుక్రవారం ఆయన ఏయూకు విచ్చేసి వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం వర్సిటీ ఉన్నతాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఉన్నత విద్య రంగంలోని విశ్వవిద్యాలయాల ఉద్యోగుల వేతనాలు, విద్యార్థులకు అందిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవనెలకు రాష్ట్ర ప్రభుత్వం 7500 కోట్ల రూపాయలుపైగా వెచ్చించడం జరుగుతోందన్నారు. దీనిని సద్వినియోగం చేస్తూ పూర్తిస్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ఎంతో అవసరమన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణ పటిష్టంగా జరగాలని సూచించారు. ఆచార్యులు నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారు తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు.
విశ్వవిద్యాలయం పరిశోధనలకు కేంద్రంగా నిలవాలని, అదే సమయంలో పరిశోధనల్లో నాణ్యత పెంపొందించాలన్నారు. ఆచార్యుల ప్రగతిని కాలానుగుణంగా నిపుణులతో మదింపు చేయాలని సూచించారు. దీనికి ప్రత్యేక కమిటీని నియమించి, పర్యవేక్షణ జరపాలన్నారు. ఆచార్యులు ప్రతీ సంవత్సరం తమ జ్ఞానాన్ని, ప్రగతిని, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, విశిష్ట పరిశోధనలు జరపడం, అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధన పత్రాలను ప్రచురించడం ఎంతో అవసరమన్నారు. విశ్వవిద్యాలయాలలో ఉన్న బోధనేతర సిబ్బందికి నైపుణ్యలేమి వేధిస్తోందన్నారు. వర్సిటీలోని ప్రతీ ఉద్యోగికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని మానవ వనరుల అభివృద్ది కేంద్రాన్ని కోరారు. ఉద్యోగులు సామర్ధ్యాలు, నైపుణ్యాలకు అనుగుణంగా వారికి అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి పూర్తి సామర్ధ్యాలను ప్రస్పుటం చేస్తూ సమర్ధవంతంగా సేవలు అందించే దిశగా నడిపించాలన్నారు. ఈ పక్రియలో క్రమశిక్షణకు ప్రాధాన్యం కల్పించాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై క్రమశిక్షణ చర్యలకు సైతం వెనకాడరాదని స్పష్టం చేశారు.విశ్వవిద్యాలయంలో పరిశోధకుల ప్రగతి, పరిశోధనలపై పర్యవేక్షణ జరపాలన్నారు. పరిశోధనల్లో నవ్యత, నూతనత్వం, ఆవిష్కరణలు ఉండాలని తెలిపారు.
వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో(జిఇఆర్)ను చేరుకునే దిశగా పనిచేస్తున్నామన్నారు. సాంకేతికతను లాభదాయకంగా మార్చుకుంటూ డిజిటల్ స్టూడియోను సైతం ఏయూ దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. విశ్వవిద్యాలయ ప్రగతి, చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం వర్సిటీ తరపున సతీష్ చంద్రను సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ప్రిన్సిపాల్స్ ఆచార్య పి.రాజేంద్రకర్మార్కర్, ఎస్.సుమిత్ర, వై.రాజేంద్ర ప్రసాద్, ఎస్.కె భట్టి, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, క్రిష్ణమంజరి పవార్, డీన్‌లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.