మైనింగ్ శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచాలి..
Ens Balu
2
Anantapur
2021-01-08 21:17:59
మైనింగ్ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకున్న ఆదాయం సాధించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం మిగిలిన ఆర్థిక సంవత్సరంలో కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి జిల్లా మైనింగ్ శాఖ డీడీ ఎస్వీ రమణా రావు, అనంతపురం ఏడీ బాలాజీ నాయక్, తాడిపత్రి ఏడీ డి.ఆదినారాయణ, జిల్లా ఇసుక అధికారి కొండా రెడ్డిలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్ఓసీలు ఉన్నా లైసెన్సులను ఇచ్చే విషయంలో సంబంధిత తహసీల్దారు కార్యాలయాలతో సమన్వయం చేసుకుని కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అధికారీ తన పరిధిలోని అప్లికేషన్లు పెండింగులో లేకుండా చూడాలన్నారు. జిల్లాలో మైనింగ్ శాఖ ఆదాయ వనరులపై కలెక్టర్ ఆరా తీసారు. అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడంపై అధికారులను వివరణ కోరారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రావాల్సిన బకాయిలను పూర్తిగా వసూలు చేయాలన్నారు. మైనింగ్ అక్రమదారుల నుంచీ పెనాల్టీల రూపంలో రావాల్సిన ఆదాయం సక్రమంగా వసూలు చేయాలన్నారు... జిల్లాలో ఉన్న ఖనిజ వనరులకు, మైనింగ్ శాఖ ద్వారా సమకూరే ఆదాయానికి పొంతన వుండేలా చూడాలన్నారు. ఇసుక పంపిణీ విషయంలో సంతృప్తిని వ్యక్తం చేశారు. బుకింగ్ చేసుకుంటున్న ఇసుక కంటే ఎక్కువ ఉత్పత్తి జరగడం మంచి పరిణామం అన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగాలనీ.. నాడు-నేడు, గ్రామ సచివాలయాలు, జగనన్న ఇళ్ల, ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక కొరత రాకుండా చూసుకోవాలన్నారు.