కరోనా జాగ్రత్తలతో పల్స్ పోలియో..
Ens Balu
4
Srikakulam
2021-01-08 21:20:47
కరోనా జాగ్రత్తలతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య సిబ్బంది మాస్కులు సానిటైజర్లను వుపయోగించాలని సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. వాక్సన్ ను హైజినిక్ కండిషన్ లో వుంచాలని తెలిపారు. కరోనా బాధితులు కాని, కరోనా లక్షణాలు వున్న వారు కాని పల్స్ పోలియో విధులలో వుండరాదన్నారు. ప్రతీ పి.హెచ్.సి.లోను, సానిటైజర్లు సోప్స్, మాస్కులు అందుబాటులో వుంచాలని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లాలోని 0 నుండి 5 సం.లలోపు పిల్లలందరికీ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఏ ఒక్కరూ తప్పిపోరాదన్నారు. ఈ నెల 17, 18, 19 తేదీలలో పోలియో కార్యక్రమం వుంటుందని, మహిళా సంఘాలు, మారుమూల ప్రాంతాలను గుర్తించాలన్నారు. వలస కార్మికుల పిల్లలను గుర్తించాలన్నారు. ముఖ్యంగా గ్రానైట్ పనులు చేసే వారు, చెరకు తోటలలో పని చేసే వారు.బొమ్మలు అమ్ముకునే వారు, నిర్మాణ రంగంలో వుండే కార్మిక కుటుంబాలను గుర్తించాలన్నారు. హైవే రోడ్డుపనులు చేసే వారు, ఇసుక బట్టీల పని వారల పిల్లలకు తప్పని సరిగా పోలియో వేయాలన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులు, మహిళా సంఘాలు, స్వఛ్ఛంద సంస్థలు హైరిస్క్ ప్రాంతాలను వలస కార్మికులను గుర్తించాలన్నారు. కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.
జిల్లాలో 2,33,683 మంది పిల్లలను గుర్తించడం జరిగిందని, 1616 కేంద్రాలలో పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. 83 మొబైల్ టీమ్ ల ద్వారా వీధి బాలలు, సంచార జాతుల బాలలకు వేయడం జరుగుతుందని తెలిపారు. 247 హైరిస్క్ ఏరియాలలోను, బస్ స్టాండులు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, సంతలలో సైతం 17, 18,19 తేదీలలో పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. 7218 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, 158 మంది సూపర్ వైజర్లను నియమించామని, వేక్సిన్ తరలింపు కోసం 251 వాహనాలను ఏర్పాటు చేసామని తెలిపారు. మండలాలలోను, గ్రామాలలోను ప్రజలకు మైక్ ద్వారాను, టామ్ టామ్ ద్వారాను అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్ధులచే ర్యాలీలు, నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.చంద్ర నాయక్, జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి బి.జగన్నాధం, జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి భారతి, డి.సి.హెచ్.ఎస్. బి.సూర్యారావు,రిమ్స్ ప్రిన్సిపాల్ డా.కృష్ణ వేణి, సూపరెటెంటెంట్ డా. ఎ. కృష్ణ మూర్తి, డా.కృష్ణమోహన్, డా.అప్పారావు జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. లక్ష్మీపతి, నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి వెంకటరావు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, వివిధ స్వఛ్ఛంద సంస్థల ప్రతినిధులు, మంత్రి వెంకట స్వామి, నటకుల మోహన్, ,తదితరులు హాజరయ్యారు.