మత సామరస్యాలకు విఘాతం కలిగేస్తే చర్యలే..


Ens Balu
2
Anantapur
2021-01-08 21:24:46

మతసామరస్యాలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లాస్థాయి మత సామరస్య కమిటీల ఏర్పాటు, వాటి బాధ్యతలపై పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గడిచిన కొన్ని రోజుల కాలంలో రాష్ట్రంలో మతపరమైన సంస్థలపై జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రాష్ట్రం అన్నారు. అలాంటి రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయని, శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేలా, మత సామరస్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు .రాష్ట్రంలోని ప్రజలు వసుదైక కుటుంబంగా జీవిస్తూ ఉన్నారని, అలాగే జిల్లాలో సైతం ప్రజలు మతపరమైన సంప్రదాయాలను పాటిస్తూ, ఒకరినొకరు గౌరవిస్తూ జీవించడం జరుగుతోందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  జిల్లాలోని ప్రజల మతపరమైన విశ్వాసాలకు విఘాతం కలుగకుండా,వారి మనోభావాలను పరిరక్షించేందుకు జిల్లాస్థాయి మత సామరస్యం కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని, జిల్లా ఎస్పీ వైస్ ఛైర్మన్ గా ఉంటారన్నారు .అలాగే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు,జైనులు తదితర ప్రతినిధులను సభ్యులుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.మైనారిటీ,ఎండోమెంట్ శాఖలకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారని,ఈ కమిటీలో  జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవిన్యూ)సభ్యులు/ కన్వీనర్ గా ఉంటారన్నారు. ప్రతి గ్రామ ,మండల, డివిజన్ వారీగా మతపరమైన అవాంతరాలు ఏమైనా సంభవించే అంశాలు గుర్తించి వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుందన్నారు.  జిల్లాలో సున్నితమైన మరియు హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల జాబితాను సిద్ధం చేసుకొని అటువంటి ప్రాంతంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గత వివాదాలు/ఘర్షణల సంఘటనలను పరిగణలోకి తీసుకొని అలాంటి కేసులను పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరుగుతుందన్నారు. భూవివాదాలు/మత వివాదాలు/ఉద్రిక్తతలను ప్రేరేపించే అవకాశం ఉన్న ఇతర సమస్యలను కూడా గుర్తించి ,జాబితాను తయారు చేసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని మత భవనాలు, నిర్మాణంమరియు స్మారక కట్టడాలను భద్రతా ప్రణాళిక ను పదిరోజుల్లో సిద్ధం చేసి ,వాటిని జిల్లా స్థాయి కమిటీలో ఆమోదించడం జరుగుతుందన్నారు.  జిల్లాస్థాయి కమిటీ ద్వారా తరచూ క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించి ప్రజల విశ్వాసం కల్పించే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఎవరైనా మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిపై ఐపీసీ లోని వివిధ విభాగాల క్రింద కేసులను బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాస్థాయి కమిటీ తోపాటు గ్రామ,మండల ,డివిజన్ల వారీగా కూడా కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని పాఠశాలలు మరియు కాలేజీలో సోదరభావం, మతసామరస్యం పెంపొందించేందుకు విద్యాశాఖ, సర్వ శిక్ష అభియాన్ ద్వారా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందన్నారు .ఇందుకు సంబంధించి గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్ల వారీగా సూచనలు కూడా జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్(రైతు భరోసా, రెవిన్యూ) నిశాంత్ కుమార్ అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.