ప్రభుత్వ భవనాలు సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
2
Anantapur
2021-01-08 21:29:13
గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, వెల్ నెస్ సెంటర్ లను వేగవంతంగా పూర్తి చేయాలి.. ఇందుకోసం అధికారులు అలసత్వం వీడి పని చేయాలని, ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణాలలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ఎన్ఆర్ఈజిఎస్ కన్వర్జన్స్ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ( గ్రా,వా,స మరియు అభివృద్ధి)ఏ.సిరి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఆరు నెలల నుంచి జరుగుతున్న గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, వెల్ నెస్ సెంటర్ ల నిర్మాణంలో ఎలాంటి అలసత్వం, అజాగ్రత్త వహించకుండా మార్చి 31వ తేదీ లోపు ఆయా భవనాల నిర్మాణాలను పూర్తి చేసేలా వేగవంతంగా చేపట్టాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆశయాలకు అనుగుణంగా మార్చి నెలాఖరు లోపు పనులు పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై ఖచ్చితమైన రిపోర్ట్ లు అందించాలి :
జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, వెల్ నెస్ సెంటర్ లు, సిసి రోడ్లు, బిటి రోడ్లు, సి సి డ్రైన్ నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు ఖచ్చితమైన రిపోర్టులను జిల్లా కలెక్టర్ కు అందించాలన్నారు. ఆయా భవన నిర్మాణాల పనులపై ఎప్పటికప్పుడు ఎంతమేరకు పనులు పూర్తయ్యాయి అనేది ఫోటోలు తీసి రిపోర్టులు అందజేయాలన్నారు. ఆయా నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు సర్ప్రైజ్ విజిట్ లు చేస్తారని, ఆయా నిర్మాణాలకు సంబంధించి రిపోర్టులో అందించిన నివేదిక ప్రకారం పనులు జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా భవన నిర్మాణాలపై ప్రతిరోజూ ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి అనే విషయంపై సమీక్ష చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేసి ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. జిల్లాకు ఎన్ఆర్ఈజీఎస్ కన్వర్జెన్స్ పనుల కింద కేటాయించిన నిధులు మురిగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ఆయా భవన నిర్మాణాల్లో ఒక ఏజెన్సీ రెండు, మూడు పనులు చేస్తుంటే పరిశీలించి ఒక ఏజెన్సీ ఒక పని మాత్రమే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ కన్వర్జెన్స్ పనులపై మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, ఆయా డివిజన్ల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను ఎంతమేరకు పూర్తి చేశారు అనేది సమీక్ష చేస్తామన్నారు. ఇప్పటివరకు ఎక్కువ సమయం లో పనులు తక్కువగా జరిగాయని, ఇప్పటి నుంచి మార్చి నెలాఖరు లోపు తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేపట్టి ఆయా భవన నిర్మాణాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు.
అలాగే మనబడి నాడు నేడు పనులపై కూడా దృష్టి సారించాలని, ఫిబ్రవరి నెలాఖరు లోపు పనులు పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఆయా పాఠశాలలను ఉపయోగించుకునేలా అన్ని రకాలుగా సిద్ధం చేయాలన్నారు. అలాగే నూతన పీహెచ్సీలకు సంబంధించి భూమి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని డిఎంఅండ్హెచ్ఓ కి సూచించారు.
నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఆయా ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు, సిసి రోడ్లు, బిటి రోడ్లు, సి సి డ్రైన్ నిర్మాణ పనులలో నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఆయా ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరాదని ఆదేశాలు ఇచ్చారని, అందుకనుగుణంగా నాణ్యత పై ఎక్కువ దృష్టి సారించి పని చేయాలన్నారు. నాణ్యత సరిగా లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కన్వర్జెన్స్ పనుల కింద చేపట్టిన ఆయా భవన నిర్మాణాలలో ఏవైనా సమస్యలు ఉంటే ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణాలలో నిర్లక్ష్య ధోరణి వదిలివేసి ప్రతి ఒక్క అధికారి పనిచేయాలన్నారు. జిల్లాకు 840 కోట్ల రూపాయల పనులు కేటాయిస్తే ఇప్పటివరకు 130 కోట్ల రూపాయల పనులు ఖర్చు చేశారని, మిగిలిన 710 కోట్ల రూపాయల పనులను ఖర్చు చేయాల్సి ఉందని, ఆయా పనులను వేగంగా చేపట్టాలన్నారు. మార్చి నెలాఖరు లోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 1.27 కోట్ల రూపాయల పనులు ప్రతి డివిజన్ పరిధిలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ఎంత మేరకు పనులు చేశారనేది డివిజన్ల పరిధిలో పరిశీలించాలన్నారు. ఆయా అభివృద్ధి పనులపై వారానికి రెండుసార్లు సమీక్ష చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డుల వారిగా ఈరోజు ఎంత పని చేయాలనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ స్థాయిలో సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. దశల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. ఒక్క పైసా నిధులు కూడా ల్యాప్స్ కాకుండా ఉండేలా పనులను వేగవంతంగా 100 శాతం నాణ్యతతో చేపట్టాలన్నారు.
కాంట్రాక్టర్లకు అప్పగించిన భవన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయగలరా, లేదా అనే అంశాలను సమీక్షించుకుని ముందుకెళ్లాలన్నారు. ఒక కాంట్రాక్టరు ఒక భవన నిర్మాణ పనులు మాత్రం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా డివిజన్, మండల పరిధిలో డిఈ లు, ఏ ఈ లు చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి ఎంత మేరకు కనిపించింది అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం లోపు ఆయా అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ ( గ్రా,వా,స మరియు అభివృద్ధి)ఏ.సిరి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణంలో నాణ్యత గా పనులు జరిగేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఈలు ఖచ్చితంగా ఫీల్డ్ కి వెళ్లాలని, డి ఈ లు కూడా బాధ్యత తీసుకుని పనిచేయాలన్నారు. డీఈలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ప్రతిరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ల వారీగా సమీక్ష చేసుకుని పనులు వేగవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, డీఈవో శామ్యూల్, సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్, ఎపిఈడబ్ల్యు సి, ఎస్ఎస్ఏ ఈఈ శివ కుమార్, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిఆర్డిఎ పిడి నర్సింహారెడ్డి, జెడ్పి సి ఈ ఓ శోభ స్వరూపారాణి, డిపిఓ పార్వతి, వ్యవసాయశాఖ జెడి రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్ ఈఈ లు, డిఈ లు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.