గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి..
Ens Balu
3
Anantapur
2021-01-08 21:30:25
జనవరి 26న గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని డివిజన్ స్థాయిలో ఈ నెల 19, 20, 21 తేదీలలో విద్యార్థినీ ,విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన వారిని ఎంపిక చేసి జిల్లా కేంద్రంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో కు సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అందిస్తున్న సేవలు, కల్పిస్తున్న లబ్ధిని తెలియజేసేలా వినూత్నమైన తరహాలో శకటాలను రూపొందించాలన్నారు. ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి ప్రతి క్యాటగిరికి సంబంధించి 2 శాతానికి మించకుండా అధికారులను ఎంపిక చేసి జాబితాను డిఆర్ఓ కి పంపించాలన్నారు. ప్రభుత్వ శాఖల ప్రగతి ని ప్రతిబింబిస్తూ స్టాల్ల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్క అంశంపై సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించి అత్యంత వైభవోపేతంగా ఘనతంత్ర దినోత్సవవేడుకలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, డా.ఏ.సిరి, గంగాధర్ గౌడ్, అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు, డిఆర్ఓ గాయత్రి దేవి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.