సచివాలయ నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
Ens Balu
2
Visakhapatnam
2020-08-12 15:41:33
గ్రామ సచివాలయ భవన నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల హెచ్చరించారు. బుధవారం తాహశీల్దారులు, ఇంజనీరింగ్ అధికారులతో మన బడి నాడు నేడు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు, ఉపాధిహామీ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అరకువేలీ మండలం లోతేరు సచివాలయం భవన నిర్మాణం ప్రారంభించలేదని తాహశీల్దారిని, ఆర్ ఐ, వి ఆర్ ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వచ్చే సోమవారం నాటికి పనులు ప్రారంభించక పోతే చార్జిమెమో జారీ చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. నాడు నేడు పనులు వేగం పెంచాలని ఆదేశించారు. నాడు నేడు పనులు 33 శాతం పురోగతి సాధించారని ఈనెల 17 తేదీ నాటికి 66 శాతం ప్రగతి సాధించాలన్నారు. ఇసుక, సిమ్మెంటు సమస్యలు లేకుండా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్ల పనులు రూఫ్ స్దాయికి రావాలని, ఎలక్ట్రికల్ పనులు మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహా పధకం పనులపై సమీక్షిస్తూ ఆర్ ఓ ఎఫ్ ఆర్ లబ్దిదారులు 70 వేల కుటుంబాలు ఉన్నాయని వారందరికి 150 రోజులు పని కల్పించాలని స్పష్టం చేసారు. రూ.350 కోట్ల ఉపాధిహామీ పనులు చేయాలని లక్ష్యంగా నిర్దేశిస్తే, రూ.197 కోట్ల పనులు మాత్రమే చేసారని నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని అన్నారు. కాఫీ తోటల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ కె వి ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇ కుసుమ భాస్కర్, కాఫీ ఎడి రాధాకృష్ట, ఎన్ ఆర్ ఇ జి ఎస్ ఎపిడి సి.హెచ్. లచ్చన్న, గిరిజన సంక్షేమశాఖ డి. ఇ అనుదీప్ , ఎటిడబ్ల్యూ ఓ రజని తదితరులు పాల్గొన్నారు.