నిర్లక్ష్యం వహిస్తే ఇక ఇంటికి పంపిస్తా..
Ens Balu
3
Chittoor
2021-01-08 21:43:46
ప్రజల ఆర్థిక స్థితిగతులు మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకు రావడం జరిగిందని, అయితే కొంత మంది నిర్లక్ష్యంగా పని చేయడం తో వ్యవస్థకు ఇబ్బంది కలుగుతోందని వారి మీద చర్యలు తీసుకోక తప్పదని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక జిల్లా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎం పి డి ఓ లు, ఏ పి ఎం లు, ఏ పి ఓ లు మరియు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్థితిగతులు మార్చేందుకు జగనన్న తోడు, వై.ఎస్.ఆర్ బీమా, వై.ఎస్.ఆర్ ఆసరా పథకాలను ప్రవేశ పెట్టిందని, ఇందులో జిల్లా వ్యాప్తంగా 30 మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లు 20 శాతం కూడా లక్ష్యాలను సాధించ లేక పోయారని, అదే విధంగా వై.ఎస్.ఆర్ ఆసరా పథకం కూడా 25 గ్రామ సచివాలయాల్లో అట్టడుగు స్థాయిలో ఉందని ఇంకొన్ని చోట్ల దరఖాస్తులు కూడా చూపించడం లేదని అన్నారు. సరైన లక్ష్యాలను సాధించాలంటే క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, లబ్ధిదారులను గుర్తించి బ్యాంకర్లతో లింకేజీ కల్పించాలని, ఇప్పటి వరకు ఆ విధంగా చర్యలు తీసుకోని పలువురు మీద క్రమ శిక్షణా చర్యలు చేపడతామన్నారు. క్షేత్ర స్థాయిలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు సక్రమంగా పని చేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతాయన్న జిల్లా కలెక్టర్ జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన పథకాలను అమలు చేయలేకపోయిన పలు గ్రామ సచివాలయాలను పేర్లను చదివి వారి పై చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా కలికిరి, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి, చిత్తూరు, నాగలపురం లలోని పలు సచివాలయ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తో వారి పై చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. అదే విధంగా 60 సం. ల లోపు జిల్లాలో ఉన్న లక్ష మందికి చదవడం, వ్రాయడం నేర్పించాలని లక్ష్యం గా పెట్టుకున్నామని, ఇందులో 70 శాతం మేర ఫలితాలు సాధించామని, మిగిలిన సచివాలయాల్లో వంద శాతం ఫలితాలు సాధించామన్నారు. సచివాలయ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు వారి విధుల పట్ల ఎం పి డి ఓ లు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జె సి (అభివృద్ధి) వీరబ్రహ్మం, జెడ్పీ సిఇఓ పభాకర్ రెడ్డి, డిఆర్డిఏ పిడి తులసి, తదితర అధికారులు పాల్గొన్నారు.