ధనుర్మాస పూజతో వెయ్యేళ్ల పూజాఫలం..
Ens Balu
3
Kurnool
2021-01-08 22:41:45
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా కర్నూలు నగరంలోని ఎపిఎస్‌పి మైదానంలో శుక్రవారం సాయంత్రం ధనుర్మాస లక్ష్మీదీపారాధన కార్యక్రమం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, శ్రీ లక్ష్మీ దేవి ఉత్సవమూర్తులను వేదికపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రతీర్థ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ పవిత్రమైన ధనుర్మాసంలో పూజలు చేస్తే వెయ్యేళ్ల పూజాఫలం సిద్ధిస్తుందని ఉద్ఘాటించారు. దీపం త్రిమూర్తులకు, నక్షత్ర దేవతలకు ఆవాస స్థానమని, ధనుర్మాసంలో లక్ష్మీ దీపారాధన వల్ల సమస్త మానవాళికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. భగవంతుడు సర్వస్వతంత్రుడని, అయితే భక్తులు ఎక్కడైతే ఆర్తితో కొలుస్తారో అక్కడ ప్రత్యక్షమౌతాడని వివరించారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కర్నూలుకు వేంచేయడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. హైందవ సనాతన ధర్మాన్ని, ఆచారాలను విస్తృత ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు విశేషంగా కృషి చేస్తోందని కొనియాడారు. ధర్మ ప్రచారంతో పాటు సమాజ సంక్షేమం కోసం ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి తిరుమలకు వెళుతున్న భక్తులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేస్తోందన్నారు.
అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, టీటీడీ ప్రపంచంలోనే ప్రసిద్ధ ధార్మిక సంస్థ అని చెప్పారు. ప్రభుత్వం, పాలక మండలి నేతృత్వంలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆధ్యాత్మిక సంపదను ప్రజలకు మరింత చేరువ చేసి, యువతను సన్మార్గంలో పయనింప చేసే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పురాణాల పట్ల ప్రజలకు ఆసక్తి కల్పిచేందుకు టీటీడీ ప్రయత్నిస్తోందన్నారు. కరోనా వైరస్ ను నిర్మూలించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ సుందరకాండ, విరాటపర్వం, భగవద్గీత పారాయణం లాంటి ఎన్నో కార్యమాలను టీటీడీ నిర్వహిస్తోందన్నారు. వీటి ఫలితంతో పాటు ప్రభుత్వం చేసిన శాస్త్ర సంబంధ కార్యక్రమాల వల్ల రాష్ట్రం లో కరోనా ప్రభావం ఒక శాతం కంటే తక్కువకు చేరిందన్నారు.
కార్తీక మాసం శివుడికే కాక శ్రీ మహా విష్ణువుకు కూడా ప్రీతికరమైందని పురాణాలు వెల్లడిస్తున్నాయని ఈవో తెలిపారు.అందువల్లే కార్తీక మాసంలో టీటీడీ తిరుమల లో శ్రీ మహావిష్ణువు, తిరుపతిలో పరమ శివుడికి సంభందించిన అనేక వ్రతాలు, పూజలు నిర్వహించిందని డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా గోదా కళ్యాణం, కనుమ పండుగ రోజు గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. లక్ష్మీ దీపారాధన కార్యక్రమం విజయవంతం చేయడానికి రూపకల్పన చేసిన అదనపు ఈవో ధర్మారెడ్డి, శాసన సభ్యులు కాటసాని రాం భూపాల్ రెడ్డి తో పాటు మిగిలిన దాతలకు, జిల్లా అధికార యంత్రాంగానికి ఈవో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మైదానంలోని వేదికను విద్యుద్దీపాలతో, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. విశేష సంఖ్యలో హాజరైన మహిళలు భౌతిక దూరం పాటించి దీపాలు వెలిగించారు. మైదానంలో బారీకేడ్లు, తివాచీలు ఏర్పాటు చేశారు. వైదిక మంత్ర పఠనం, శ్లోకప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమం ఎలాంటి విఘ్నం లేకుండా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, కాలశుద్ధి, స్థలశుద్ధి కోసం వేదస్వస్తి నిర్వహించారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకురాలు డా.కె.వందన బృందం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ కనకధారా స్తోత్రం పఠించారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీ మారుతి మహాలక్ష్మీ అనుగ్రహ ఆవశ్యకతను, దీప ప్రశస్తిని వివరించారు. ఆ తరువాత శ్రీ అలమేల్మంగ నామావళి, అష్టలక్ష్మీ వైభవం నృత్య రూపకం, గోవిందనామాలు పారాయణం చేశారు. కార్యక్రమాన్ని డ్రోన్ ద్వారా తీసిన వీడియో భక్తులను విశేషంగా ఆకర్షించింది.
ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, మురళీకృష్ణ, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, డిఐజి వెంకటరామరెడ్డి, జిల్లా ఎస్పీ డా.కె. ఫకీరప్ప, నగరపాలక సంస్థ కమీషనర్ డి.కె. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.