చెట్లనూ తల్లిదండ్రులుగా భావించాలి..
Ens Balu
2
Vizianagaram
2021-01-09 16:25:08
మనకు జన్మనిచ్చేది తల్లి అయితే స్వచ్ఛమైన గాలి అందించి మన ఆయుష్షును పెంచేవి మొక్కలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాంలోని మంచినీటి కోనేరు ఆవరణలోను, బుదరాయవలసల్లో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీగా మొక్కలు నాటే కార్యక్రమాల్లో కలెక్టర్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ అపరిశుభ్రతే అనారోగ్యానికి కారణమని, మన ఇంటినే కాకుండా మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని అన్నారు. మనం వందేళ్లు బతకాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మూగ జీవాలకూ మనలాగే నీరు అవసరమని చెరువుల్లో వ్యర్ధాలు వేసి నీటిని కలుషితం చేయవద్దన్నారు. ప్రతి వ్యక్తికీ 97శాతం ఆక్సిజన్ అవసరమని పేర్కొంటూ అది చెట్ల ద్వారానే లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి జానకిరావు, డ్వామా పి.డి. నాగేశ్వరరావు, ఎంపిడిఓ త్రినాధరావు, తహశీల్దార్ రత్నకుమార్, ఎక్సయిజ్ ఎస్.ఐ. చిన్నంనాయుడు, గ్రామ మాజీ సర్పంచ్ తాడ్డి వేణుగోపాలరావు, చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు ముడిదాపు రాము, గౌరవ అధ్యక్షులు మీసాల శ్రీకాంత్, కన్వీనర్ విజినిగిరి శంకరరావు, డి.సి.ఎం.ఎస్. ఛైర్మన్ శిరువూరి రమణమూర్తి రాజు, మాజీ జెడ్పీటీసీ కోట్ల వెంకట్రావు, ఇ.ఓ. వాసుదేవరావు, గ్రామ యువత, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.