మ‌త సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక క‌మిటీ..


Ens Balu
4
Vizianagaram
2021-01-09 18:59:18

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మ‌త సా‌మ‌రస్యాన్ని  కాపాడేందుకు అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నామ‌ని.. దానిలో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు జిల్లా మ‌త సామ‌ర‌స్య కమిటీ ఏర్పాటు చేశామ‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ప‌విత్ర పుణ్య‌క్షేత్రం రామ‌తీర్థంలో ఇటీవ‌ల జరిగిన ఘ‌ట‌న నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్, ఎస్పీ బి.రాజ‌కుమారి సంయుక్తంగా క‌మిటీ స‌భ్యులతో క‌లిసి శ‌నివారం క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో జ‌రిగిన‌ విలేక‌రుల స‌మావేశంలో దీనికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. మ‌త‌సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం అన్ని చ‌ర్య‌లూ చేప‌డుతుంద‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. దానిలో భాగంగానే వివిధ మ‌తాల‌కు చెందిన ప్ర‌తినిధులతో జిల్లా మ‌త సామ‌ర‌స్య క‌మిటీ ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. దీనిలో హిందు, సిక్కు, జైన‌, ముస్లిం, క్రైస్త‌వ  మ‌తాలకు చెందిన వ్య‌క్తులు స‌భ్యులుగా ఉంటార‌ని చెప్పారు. వీరంతా మ‌త‌సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకు.. శాంతి భ‌ద్ర‌తల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని వెల్ల‌డించారు. మ‌త ప్రాతిప‌దిక‌న జ‌రిగే హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను.. ఉద్రిక్తత‌కు దారితీసే ప‌రిస్థితుల‌ను అదుపు చేసేందుకు క‌మిటీ స‌భ్యులు కృషి చేస్తార‌ని వివ‌రించారు. భ‌ద్రతా ప‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టి స‌మాజంలో శాంతి నెల‌కొల్ప‌టమే ల‌క్ష్యంగా అంద‌రం క‌లిసి క‌ట్టుగా ప‌ని చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. స‌మాజంలో విశ్వాసం పెంపొందించేందుకు.. ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపేందుకు గ్రామాల్లో కమిటీ సభ్యులు ప‌ర్యటిస్తార‌ని వివ‌రించారు. స‌మ‌స్యాత్మ‌క‌.. అతి స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌ను గుర్తించి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. అనంత‌రం క‌మిటీ సభ్యుల వివ‌రాలు.. విధివిధానాల గురించి వివ‌రించారు. అనంత‌రం ఎస్పీ బి.రాజ‌కుమారి మాట్లాడుతూ జిల్లాలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను  కాపాడేందుకు పోలీసు శాఖ నుంచి అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు సంయ‌మ‌నం  పాటించి శాంతిభ‌ద్ర‌తలు కాపాడేందుకు స‌హ‌కారం అందించాల‌ని కోరారు. జిల్లాలో ఉన్న సున్నిత‌మైన ప్రాంతాల్లో ఇప్ప‌టికే భ‌ద్ర‌తా ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని.. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌ఠిష్ట‌మైన భ‌ద్రత ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. జిల్లాలో గ‌త నాలుగు నెల‌ల్లో ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించి సున్నిత‌మైన ప్రాంతాల‌ను గుర్తించామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ ఆల‌యాల్లో 95 మాత్ర‌మే సి.సి. కెమెరాలు ఉండేవ‌ని ప్ర‌త్యేక డ్రైవ్ అనంత‌రం జిల్లాలోని వివిధ ఆల‌యాల్లో.. ప్రార్థ‌నా మందిరాల్లో  928 సి.సి. కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. సుమారు 2000 ప్రార్థ‌నా మందిరాలు, ఆల‌యాల్లో మ‌రిన్ని సి.సి కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా నోటీసులు పంపించామ‌ని వెల్ల‌డించారు.  గ్రామాల్లో శాంతి క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌టం.. మ‌హిళా పోలీసుల స‌హ‌కారంతో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడేందుకు అన్ని ర‌కాలు చర్య‌లూ తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. శాంతి క‌మిటీల ద్వారా గ్రామాల్లో ఉండే మ‌త‌ప‌ర‌మైన క‌ట్ట‌డాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు. 2019లో నెల్లిమ‌ర్ల‌.. ఇటీవ‌ల రామ‌తీర్థంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్లో మాత్ర‌మే వివ‌రాలు ల‌భ్యం కాలేద‌ని మిగ‌తా అన్ని కేసుల‌ను ఛేదించామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయి సమీక్ష‌లు నిర్వహించి రామ‌ తీర్థంలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఎస్పీ వివ‌రించారు. ఎలాంటి సంఘ‌ట‌న జ‌రిగినా త‌క్ష‌ణ చ‌ర్య‌లుతీసుకుంటున్నామ‌ని చెప్పారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల్లో త‌ప్పు చేసిన వారిపై మాత్ర‌మే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని.. నిర్థోషుల‌ను ఎవ‌రినీ ఇబ్బంది పెట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌త‌ప‌రమైన ఉద్రిక్త‌త‌ను ప్రోత్స‌హించే వారిపై ఏపీ ప‌బ్లిక్ సేఫ్టీ చ‌ట్టాన్ని అనుస‌రించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. మ‌త‌సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని.. అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటామ‌ని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా మ‌త సామ‌ర‌స్య క‌మిటీ.. 1. జిల్లా క‌లెక్ట‌ర్ - ఛైర్మ‌న్‌ 2. ఎస్పీ            - వైస్ ఛైర్మ‌న్‌ 3. స‌హాయ సంచాల‌కులు (మైనారిటీస్‌)- మెంబ‌ర్‌ 4. సహాయ క‌మీష‌న‌ర్ (దేవాదాయ శాఖ‌)- మెంబ‌ర్‌ 5. సంయుక్త క‌లెక్ట‌ర్ (రెవెన్యూ)- మెంబర్ క‌న్వీన‌ర్‌ 6. పీస‌పాటి సంప‌త్ కుమార్ ఆచార్యులు (హిందూ)- మెంబ‌ర్‌ 7. ఎస్‌.కె. అన్స‌ర్ జానే మౌజాన్ (ముస్లిం)  - మెంబ‌ర్‌ 8. లూర్దు మార్నేని ( క్రైస్త‌వ‌)     - మెంబ‌ర్‌ 9. ప్ర‌వీణ్ కుమార్ అంచాలియా (జైన్‌)- మెంబ‌ర్‌ 10. బాబాజీ జస్‌బీర్ సింఘ్ (సిక్కు)- మెంబ‌ర్‌