సచివాలయ కార్యదర్శిలు ప్రజల్లోకి వెళ్లాలి..
Ens Balu
2
Chittoor
2021-01-09 19:32:01
సచివాలయ కార్యదర్శులు ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, వారి అవసరాలను సచివాలయాల ద్వారా తీరుస్తామని భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా వార్డు కార్యదర్శులకు మార్గనిర్దేశం చేశారు. శనివారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని దుర్గా నగర్ కాలనీ (16వ వార్డు) సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో తగ్గించి, ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తేవాలని అన్నారు. ఇదే తరహాలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరుగా స్వీకరించే విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త విధానాన్ని ప్రధాన ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోనూ అమలు చేయాలన్నారు. కార్యదర్శులు నిత్యం ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కమ్యూనిటీ కార్యదర్శులు వార్డు యొక్క భౌతిక, మౌళిక స్వరూపాలను జియోగ్రాఫిక్ విధానంలో పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. తాగునీటి పైపులు, రోడ్లు, వీధిదీపాలు, భవనాలు, ఖాళీ స్థలాలు అన్నింటిని జియో టాకింగ్ చేయాలన్నారు. అనంతరం పౌర సేవలు అందిస్తున్న తీరుపై సమీక్షించారు. స్థానిక ప్రజలకు సంబంధించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారానే అందించే లాగా చూడాలన్నారు. సచివాలయాల్లో అందుతున్న పౌర సేవలపై స్థానిక ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, ప్రభుత్వం నుంచి పొందే సర్వీస్ కైనా సచివాలయాల వద్దకే రావాలనే విషయాన్ని తెలియ చెప్పాలన్నారు. సచివాలయాల్లో పౌర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ శ్రీలక్ష్మి, ఆరు గోపాల కృష్ణ వర్మ, సానిటరీ ఇన్స్పెక్టర్ జగన్, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.