పరిశ్రమలు స్థాపించాలంటే ఆ అనుమతులు తప్పనిసరి
Ens Balu
4
Visakhapatnam
2020-08-12 18:16:11
కోవిడ్ 19 లాక్ డౌన్ తరువాత ప్రారంభించే పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే ప్రారంభించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, ఎప్పటి కప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలని, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని వాటి పర్యవేక్షణకు గాను జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలక్టరు తెలిపారు. ఎల్.జి. పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన తరువాత పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు ఏర్పాటైన హైపవర్ కమిటీ సూచించిన సిఫార్సుల మేరకు జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిందన్నారు. ఈ కమిటీ లో చైర్మన్ గా జాయింట్ కలెక్టర్ (ఎ అండ్ డబ్ల్యు), డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆప్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, రీజనల్ ఆఫీసర్, ఎపిపిసిబి. డిప్యూటి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, జిల్లా అగ్నిమాపక అదికారి మెంబర్లు గాను, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం , మెంబర్ కన్వీనర్ గా ఉంటారని తెలిపారు. ఆయా పరిశ్రమలు తాము పాటించవలసిన చట్టాలు, నియమాల ప్రకారం నిర్ణీత ప్రొఫార్మాలో నివేదికను సమర్పించాలి. ఈ కమిటీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు, ఎన్విరాన్ మెంటల్ ప్రమాణాలు పరిశీలించాలని తెలిపారు. మొదటి విడతగా కెమికల్, కెమికల్ నిల్వ, తయారీ, పేలుడు పదార్దాల తయారీ, పెట్రోలియం పరిశ్రమలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించి నెలవారీగా నివేదికలు అందజేస్తాయని తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాల సమయంలో తక్షణ స్పందన నిమిత్తం పరిశ్రమల యాజమాన్యం, కార్మికయూనియన్లు, టెక్నికల్ నిపుణులు, హెల్త్ డిపార్టుమెంటు, తక్షణ స్పందన బృందాలతో జిల్లా స్థాయి సంక్షోభ నివారణ గ్రూపు ఏర్పాటుచేసి దానికి జిల్లా కమిటీ నేతృత్వం వహిస్తుందన్నారు. ఈ కమిటీ ముఖ్య విషయాలను జిల్లా కలెక్టరు దృష్టికి ఎప్పటి కప్పుడు తీసుకువస్తుందని, అదే విధంగా పరిశ్రమల భదత్రపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తుందని జిల్లా కలెక్టరు తెలిపారు.