మతసామరస్యాన్ని పెంపొందించేందుకు చర్యలు..


Ens Balu
3
Anantapur
2021-01-09 20:38:39

మత సామరస్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని, మతసామరస్యాలకు విఘాతం కలిగించేలా ఆలయాలపై ఎవరైనా దాడులకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్( రెవిన్యూ మరియు రైతు భరోసా ) నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి మత సామరస్య కమిటీల ఏర్పాటుపై మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స అభివృద్ధి)ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఇంతకుముందు మతాల మధ్య అలజడులు చెలరేగిన సంఘటనలు రాష్ట్రంలో జరగలేదని, ప్రజలంతా కలిసిమెలిసి ఉంటున్నారని, గడిచిన కొన్ని రోజుల కాలంలో రాష్ట్రంలో మతపరమైన సంస్థలపై జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో మత సామరస్యాన్ని చెడగొట్టే ఎందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిధిలోని అన్నిమతాల ప్రార్థనా మందిరాల వద్ద సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో ఎటువంటి సంఘటనలు జరిగినా వాటిని పరిష్కరించేందుకు జిల్లా స్థాయి మతసామరస్యం కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.   మతసామరస్య జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు :  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రజల మతపరమైన విశ్వాసాలకు విఘాతం కలుగకుండా, వారి మనోభావాలను పరిరక్షించేందుకు జిల్లాస్థాయి మత సామరస్యం కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని, జిల్లా ఎస్పీ వైస్ ఛైర్మన్ గా ఉంటారన్నారు. జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) మెంబర్ కన్వీనర్ గా, హిందూ ప్రతినిధులుగా పుట్టపర్తి చెందిన రత్నాకర్ రాజు, అనంతపురం చెందిన శ్యామసుందర శాస్త్రి, కె. చంద్రశేఖరరావు లను, ముస్లిం ప్రతినిధులుగా అనంతపురం కు చెందిన షేక్ షాకీర్ హుస్సేన్, అడ్వకేట్ అబ్దుల్ రసూల్ లను, క్రిస్టియన్ ప్రతినిధులుగా సుధాకర్ బాబు, సంపత్ విజయ్ కుమార్ లను, జైన్ ప్రతినిధిగా వసంతకుమార్ జైన్ లను నియమించామన్నారు. మెంబర్లుగా జిల్లా మైనారిటీ అసిస్టెంట్ డైరెక్టర్, ఎండోమెంట్ అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి మెంబర్లుగా ఉంటారన్నారు. జిల్లాస్థాయి మత సామరస్యం కమిటీని ఏర్పాటు చేయగా, అలాగే డివిజన్, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాస్థాయి మత సామరస్యం కమిటీ జిల్లాలో ఏవైనా ఘటనలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా లో క్షేత్రస్థాయి పర్యటన చేసే అవకాశం కమిటీకి ఉంటుందన్నారు. అన్ని మతాల మధ్య లో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడుతూ జిల్లాలో కరోనా లాంటి క్లిష్ట సమయంలో అన్ని మతాలవారు కూడా ఒకరి కొకరు సహకరించి కరోనా నుంచి బయటపడేందుకు కృషి చేశారన్నారు. మన జిల్లా మత సామరస్యానికి ప్రతీకని, అందరూ కలిసిమెలిసి ఉన్నారన్నారు. అన్నారు. జిల్లాలో మతసామరస్యాలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు కమిటీ దృష్టికి వస్తే తమకు తెలియజేయాలని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా 9044 హిందూ ఆలయాలు, 800 పైగా మసీదులు, 600 పైగా చర్చిలు, 15 జైన్ ఆలయాలు ఉండగా, వాటిని పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. అన్నిమతాల ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. జిల్లాలో 800కుపైగా ప్రార్థనా మందిరాల వద్ద 3200 సీసీ కెమెరాలను గత రెండు నెలల్లో ఏర్పాటు చేశామన్నారు. ఎండోమెంట్ పరిధిలోని ఆలయాలకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. జిల్లాలో మతసామరస్యం పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయా ఆలయాల వద్ద స్థానికంగానే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రాత్రిపూట ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా మతాల వారికి తెలియజేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స అభివృద్ధి)ఏ.సిరి మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాలకు అనువైనదని, ఇక్కడ అందరూ సమానమన్నారు. జిల్లావ్యాప్తంగా మతసామరస్యానికి విఘాతం కలిగించేలా ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో మతసామరస్యం పెంపొందించేందుకు మత పెద్దలు అందరూ తమ సహకారం అందించాలన్నారు.  ఈ సమావేశంలో డీఆర్ఓ గాయత్రిదేవి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ మహమ్మద్ రఫీ, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు, మైనారిటీ కార్పొరేషన్ ఈడి మస్తాన్, కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ వసంతలత, డీఈఓ శామ్యూల్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ మతాల మెంబర్ లు చంద్రశేఖర్ రావు, శ్యామ సుందర శాస్త్రి, షాకిర్ హుస్సేన్, అబ్దుల్ రసూల్, సుధాకర్ బాబు, సంపత్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.