ఎన్నికలకు మాప్రాణాలు ఫణంగా పెట్టలేం..
Ens Balu
2
Visakhapatnam
2021-01-10 16:02:40
కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహించలేమని ఏపీఎన్జీఓ విశాఖ యూనిట్ అధ్యక్షులు కె. ఈశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం విశాఖలోని ఏపీఎన్జీఓ హోంలో అధ్యక్షులు రమేష్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో తాము ఎన్నికల విధులు చేయలేమని ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలను ద్రుష్టిలో పెట్టుకొని కరోనా వేక్సినేషన్ పూర్తియిన తరువాత, పరిస్థితి సద్దుమణిగిన తరువాత ఎన్నికల నోటిఫికేషన్ తిరిగి ప్రకటించాలన్నారు. కరోనా సమయంలో, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమని, అదే సమయంలో తాము కూడా దైర్యంగా విధులు నిర్వహించలేమన్నారు. ప్రభుత్వం కృషితో కరోనాపై నియంత్రణ సాధిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ప్రజాహితం కాదన్న ఆయన ఎన్నికల సంఘం చైర్మెన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొండిగా ముందుకు వెళితే ఉద్యోగులంతా సామూహికంగా ఎన్నికలను భహిష్కరిస్తామని హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి చర్యలు ప్రారంభించిన తరుణంలో వైద్య సిబ్బంది, ఇతర శాఖ ఉద్యోగులు విధినిర్వహణలో నిమగ్నమై వున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా కరోనా సమయంలో విధులు నిర్వహించి ప్రాణాలు పోగొట్టుకున్న వారిని ద్రుష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. కొందరు ఉపాద్యాయ సంఘాల ప్రతినిధులు కరోనా విధులు నిర్వహణ విషయంలో మాట్లాడుతున్న మాటలను వెనక్కి తీసుకోవాలని, ఏపీఎన్జీఓ సంఘం విధుల్లోనూ, కార్యకలాపాల్లో వేలు పెట్టవద్దని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తమకు సూచన చేసే అధికారం ఉపాధ్యాయ సంఘాలకు లేదన్నారు. కరోనా కేసులు తగ్గిన తరువాత ఎన్నికలు పెడితే వేక్సిన్ తీసుకున్న ఉద్యోగులతో విధులు నిర్వహించడానికి తాము సిద్దమేనన్నారు. తక్షణమే ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఆర్.శ్రీనివాసరావు, జె.క్రిష్ణమోహన్, సత్యనాగమణి, అప్పలరాజు, ప్రసాద్, సత్తిబాబు తదితరలు పాల్గొన్నారు.