బర్డ్ ఫ్లూ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు..
Ens Balu
4
Vizianagaram
2021-01-10 16:11:35
విజయనగరం జిల్లాలో బర్డ్‌ఫ్లూ తో ఇంతరకు కోళ్లు ఏవీ మరణించలేదని, ఈ వ్యాధిపట్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఏ.వి.నర్శింహులు తెలిపారు. జిల్లాలో కొన్ని చోట్ల మరణించిన నాటుకోళ్లను లేబొరేటరీలో పరిశోధనలు చేయించామని, వాటిలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని పేర్కొన్నారు. సాధారణంగా వచ్చే వ్యాధులతోనే ఆ కోళ్లు మరణించాయని గుర్తించామన్నారు. ఎవరికైనా జంతువులు, కోళ్లలో ఈ వ్యాధి లక్షణాలు వున్నట్టు అనుమానాలు వుంటే సమీపంలోని పశువైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధానికి అన్ని చర్యలు చేపడుతున్నామని పశుసంవర్ధక శాఖ జె.డి. పేర్కొన్నారు. వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ప్రతి మండలంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. అటవీ, పశుసంవర్ధక శాఖల్లోని క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ వ్యాధిపై, వ్యాధి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వ్యాధిని ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. జిల్లాలో రెవిన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, అటవీ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో వ్యాధి నిరోధక చర్యలు చేపడతామన్నారు.
బర్డ్ ఫ్లూ వ్యాధి ముఖ్యంగా ఒక రకమైన నీటి బాతులలో ఉంటూ ఇతర పక్షులకు వ్యాప్తి చెందుతుందన్నారు. వీటి బారిన పడే నాటుకోళ్లు, ఫారాల్లో పెంచే బ్రాయిలర్, లేయర్ కోళ్లు అతితక్కువ సమయంలో అత్యధికంగా మరణించే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా వలస పక్షులు, ఇతర జాతుల పక్షులలో కూడా కనిపించే అవకాశం ఉందన్నారు. అయితే బర్డ్‌ఫ్లూ మాత్రమే కాకుండా ఇతర శ్వాసకోస సంబంధ వ్యాధులైన కొక్కెర తెగులు(Ranikhet Disease), ఇన్‌ఫెక్యువస్ బ్రాంకైటిస్, పాశ్చురెల్లోసిస్(ఫేల్ కలరా) వంటి అంటువ్యాధులు మాత్రమే కాకుండా ఇతర వ్యాధులు కూడా కాలాలు మారే సమయంలో వ్యాపిస్తాయన్నారు. వర్షాకాలం నుండి శీతాకాలం, శీతాకాలం నుండి వేసవికాలం, వేసవి నుండి వర్షాకాలంనకు మార్పు చెందుతున్న సమయంలో వ్యాపిస్తాయని పేర్కొన్నారు. అంతేగాకుండా శీతాకాలం తీవ్రంగా ఉన్న కారణంగా చలికి తీవ్ర ఒత్తిడికి గురికాబడి శ్వాసకోస సంబంధ వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. నాటుకోళ్లలో అంతర్గత పరాన్నజీవులు అనగా ఏలికపాములు, బద్దెపురుగుల వంటి వ్యాధులు తోడవడం వల్ల అధిక స్థాయిలో మరణాలు ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు.
బర్డ్‌ఫ్లూ బారిన పక్షుల ముఖాలు, తమ్మెలు వాచి నల్లబడటం, ముక్కు నుండి ద్రవాలు కారడం, ఇతర శ్వాస సంబంధిత లక్షణాలు, విరేచనాలు, నరాల సంబంధిత లక్షణాలు, మేత తినకపోవడం వంటివి జరుగుతాయని పేర్కొన్నారు. అయితే ఈ లక్షణాలు ఇతర వ్యాధులు అయినటువంటి కొక్కెర తెగులు, ఇన్ ఫెక్చువస్ బ్రాంకైటిస్, ఫేల్ కలరా వంటి ఇతర వ్యాధుల్లో కూడా కనిపిస్తాయన్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పక్షుల్లో బర్డ్‌ఫ్లూ గా వ్యవహరించబడుతున్న ఏవియన్ ఇన్ ఫ్లూయెన్ జా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ వ్యాధి కారణంగా మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వ్యాధి ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. అయినప్పటికీ రైతుల్లోను, ప్రజల్లోనూ నెలకొన్న సందేహాలు, భయాందోళనలను తొలగించేందుకు శాఖాపరంగా అన్ని చర్యలు చేపడుతున్నట్టు పశుసంవర్ధక శాఖ జె.డి. ఒక ప్రకటనలో వెల్లడించారు.