సర్ లూయిస్ బ్రెయిలీ అంధులపాలిట దేవుడు..
Ens Balu
3
Vizianagaram
2021-01-10 16:16:51
సర్ లూయిస్ బ్రెయిలీ అంధులపాలిట దేవుడులాంటివారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ కొనియాడారు. విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, విజువల్లీ ఛాలెంజెడ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక నాల్గవతరగతి ఉద్యోగుల సంఘ కార్యాలయంలో, లూయిస్ బ్రెయిలీ 212వ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ, బ్రెయిలీ జన్మదినం ఒక పండుగలాంటిదని, దానిని జిల్లాలో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. అంధులు ఇతరులకు దేనిలోనూ తీసిపోరని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారని అన్నారు. అంధుడు అయినప్పటికీ, ఐఏఎస్ సాధించి, జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ పొందుతున్న కట్టా సింహాచలం, అందరికీ ఒక స్ఫూర్తిప్రధాతగా పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని, ఉన్నత స్థానాన్ని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అంధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం మాట్లాడుతూ లిపిని కనుగొనడం ద్వారా లూయిస్ బ్రెయిలీ, చూపులేనివారికి మహోపకారం చేశారని కొనియాడారు. అంధుల జీవితాల్లో వెలుగును నింపిన మహనీయుడని పేర్కొన్నారు. అంధులు తమలోని లోపాన్ని ప్రక్కనబెట్టి, తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. అదేవిధంగా సాటి అంధులు, నిరుద్యోగులకు సహకరించాలని సూచించారు. గొప్ప మానవతావాది అయిన జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ వద్ద తాను శిక్షణ పొందే అవకాశం రావడం అదృష్టమని పేర్కొన్నారు.
విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి.రవీంద్రబాబు మాట్లాడుతూ, అంధుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని వివరించారు. వికలాంగుల హక్కుల చట్టం-2016 రూపొందడానికి జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ ఎంతగానో సహకరించారని చెప్పారు. అవకాశాన్ని ఇస్తే, అంధులు కూడా తమలోని నైపుణ్యాన్ని చూపెడతారని, ఇతరులతో సమానంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. వారి పట్ల సానుభూతి చూపించవద్దని, ప్రతీఒక్కరూ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వేడుకల్లో విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమాశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు జి.భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి రాము, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు వీరభద్రరావు, యూత్ అసోసియేషన్ నాయకులు ఓ.నర్సింగరావు, శ్రీనివాస్, జె.సతీష్, ఎల్.రత్నరాజు, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలభాస్కర్రావు, నాల్గోతరగతి ఉద్యోగుల సంఘం పట్టణాధ్యక్షులు ఎం.గంగాప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.