విశాఖకు 46,500 కోవిడ్19 వేక్సిన్ డోసులు..


Ens Balu
1
విశాఖపట్నం
2021-01-16 19:26:47

విశాఖ జిల్లాకు 46 వేల 500 డోసులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు.  శనివారం పట్టణంలో చినవాల్తేరులోని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 నివారణకు కోవిషీల్డ్ టీకాను ఆయన ప్రారంభించారు.  అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ  ఈ టీకాను ఈ నెల 16వ తేది నుండి మొదటి దశ ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.   జిల్లాకు 46 వేల 500 డోసులు వచ్చినట్లు తెలిపారు.  ఈ డోసులను జిల్లాలో 32 సైట్స్ (సెషన్స్) ద్వారా మొదటి దశలో ఆశా కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్లు, తదితరులు ఉన్నట్లు ఆయన వివరించారు.  రెండవ దశలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయితీ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఉంటుందన్నారు.  మొదటి దశలో 5 రోజులు వరకు పరిమితంగా వ్యాక్సినేషన్ జరుగుతుందని చెప్పారు. రెండవ డోసు 28 రోజులకు ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్నా జాగ్రత్తలు (మాస్క్ ధరించడం, దూరం పాటించడం, శానిటైజర్ వినియోగం వంటివి) తప్పనిసరిగా పాటించాలన్నారు.  జిల్లాలో మరో 221 కేంద్రాలు (సైట్స్)ను గుర్తించినట్లు పేర్కొన్నారు.  ఇందులో పి.హెచ్.సి.లు, సి.హెచ్.సి.లు, టీచింగ్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, తదితరమైనవి గుర్తించినట్లు చెప్పారు.  ఈ నెల 20వ తేదీ తర్వాత మిగతా సైట్స్ లో టీకాలు వేయడం జరుగుతుందన్నారు.  అన్ని కేంద్రాల వద్ద రిఫ్రిజిరేటర్లు, లబ్దిదారులు వేచియుండు గది, టీకా వేయుగది, పరిశీలన గది ఉంటాయని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి రోజు గరిష్టంగా వంద మంది వరకు టీకాలు వేయడం జరుగుతుందని, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్ ఉంటుందని స్పష్టం చేశారు.  ఎలర్జీవంటివి ఏవైనా ఉన్నాయని ముందుగానే అడిగి తెలుసుకుంటారని,  కాంట్రా ఏడ్వర్స్ ఉన్నవారికి టీకా ఇవ్వడం జరగదన్నారు.  జిల్లాలో 15 శాసన సభ నియోజక వర్గాలు ఉండగా ఇందులో పట్టణ పరిధిలో 5, గ్రామీణ ప్రాంతంలో 10 ఉన్నాయని, ఆయా నియోజక వర్గాలలో ప్రత్యేక అధికారులుగా ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు.  పట్టణ పరిధిలో జివియంసి కమీషనర్, ఏజెన్సీ పరిధిలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, గ్రామీణ పరిధిలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఇన్ చార్జ్ లుగా వ్యవహరిస్తారని చెప్పారు.  కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలలో ఎ.ఇ.ఎఫ్. కమిటీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.  తూర్పు నావికా దళాలకు 1170 డోసులు పంపడమైనదని పేర్కొన్నారు.  కోవిన్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు.  నగర పోలీసు కమీషనర్, ఎస్.పి.లతో గత మూడు రోజులుగా కోవిషీల్డ్ టీకా సెక్యూరిటీ గూర్చి చర్చించడమైనదని తెలిపారు.  జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం నంబర్ 104 ఉంటుందని, సమస్యలు ఉంటే 104 కు ఫోన్ చేసి తెలియజేయాలని పేర్కొన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మోస్ట్ ఎఫెక్టెడ్ వారికి వ్యాక్సిన్ అందించడం జరుగుతుందన్నారు.  మూడవ దశలో 50 సంవత్సరాలు దాటిన వారికి, దీర్ఝకాలిక సమస్యలతో బాధపడుతున్న50 సంవత్సరాలు లోపల వారికి వ్యాక్సినేషన్ ఉంటుందని చెప్పారు.     ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ మాట్లాడుతూ టీకా తీసుకున్నానని, జ్వరం, నొప్పి, తదితరమైనవి వచ్చినా గాభరా పడాల్సిన పనిలేదని చెప్పారు.  టీకా వేసిన తర్వాత 30 నిమిషాలు గదిలో పరిశీలనలో ఉండాలన్నారు.  రెండవ డోసు తీసుకున్న తర్వాత వ్యాధి నిరోధక శక్తి శరీరంలో పెరగడం మొదలవుతుందని, గతంలో ఎలర్జీ ఉందా లేదా అని ముందుగానే అడిగి వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు. జిల్లాలో మొదటి టీకాను చిన వాల్తేరులోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ఆశా కార్యకర్త ఎస్. సాయిలక్ష్మికి వేశారు.  రెండవ టీకాను ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ కు వేశారు.   అంతకు ముందు కోవిడ్-19 నివారణకు కోవిషీల్డ్ టీకా వేయడమనేది ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి తెలిపారు.  శనివారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోవిషీల్డ్ టీకా ప్రారంభ ప్రక్రియను వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోందని, చాలా తక్కువ సమయంలో కరోనా వ్యాక్సిన్ వచ్చిందన్నారు.  శాస్త్రవేత్తల కృషిఫలితంగా రెండు దేశీయ టీకాలు వచ్చాయని, శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడి వ్యాక్సిన్లు తయారు చేశారని ప్రశంసించారు.  ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఎన్నో సవాళ్ల మధ్య వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు.  మొదటగా వ్యాక్సిన్ పొందడానికి ఆరోగ్య సిబ్బంది అర్హులని, ఆ తర్వాత పారిశుధ్ద్య సిబ్బందికి ఇస్తామన్నారు.  ఆ తర్వాత సైనికులు, మిగిలిన వారికి ఇస్తామని తెలిపారు.  చినవాల్తేరులోని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్వహించిన వీడియో కాన్ప్ రెన్స్ లో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సూర్యనారాయణ, సియంఓ డా. శాస్త్రి, జివియంసి జోనల్ కమీషనర్ సన్యాసినాయుడు, యుసిడి పిడి శ్రీనివాసరావు, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ ధవళ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.