వ్యాక్సినేషన్ తో అందరికీ ఆత్మవిశ్వాసం..
Ens Balu
2
Anantapur
2021-01-16 20:05:07
కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తో ప్రపంచ మానవాళికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైందని, మొదటగా శ్రీ వల్లి అనే ఫీల్డ్ వర్కర్ కి వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయడం అనేది చాలా పెద్ద ప్రక్రియ అని, ఇది దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. కరోనా వల్ల మంది మృత్యువాత పడ్డారని, కరానా లాంటి కష్ట సమయంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలు అందించారన్నారు. అందుకోసం మొదటిగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయడం జరుగుతోందని, రెండో విడతలో పోలీసు, రెవెన్యూ సిబ్బందికి, మూడవ విడతలో ప్రజలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ రావడం అనేది కరోనాపై మానవాళి విజయం అన్నారు. ప్రపంచంలోనే మానవాళికి వ్యాక్సిన్ అనేది ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి దోహదం చేస్తుందన్నారు. మొదటిసారి వ్యాక్సిన్ వేసుకున్న వారు 25 రోజుల తర్వాత రెండవ డోసు కూడా ప్రతి ఒక్కరు వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న 42 రోజుల వరకు ప్రతి ఒక్కరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఇది ఎంతో సురక్షితమైన వ్యాక్సిన్ అన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేసిన శాస్త్రవేత్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నదీమ్, డి ఐ ఓ గంగాధర్ రెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.