అనంతలో ప్రశాంతంగా కోవిడ్ వేక్సినేషన్..
Ens Balu
5
Anantapur
2021-01-16 20:09:22
అనంతపురం జిల్లాలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. శనివారం ఉదయం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స మరియు అభివృద్ధి) డా.ఏ. సిరి, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు ప్రారంభించారు. ముందుగా ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశం అందించిన అనంతరం కోవిడ్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో మొట్టమొదటి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ను డిఎంహెచ్ఓ ఆఫీస్ లో ఫీల్డ్ వర్కర్ గా పనిచేస్తున్న శ్రీవల్లి వేయించుకోగా, ఆమెకు హెల్త్ సూపర్ వైజర్ విజయకుమారి వ్యాక్సిన్ వేశారు. జిల్లాలో 26 సెషన్ సైట్లలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స మరియు అభివృద్ధి) డా.ఏ. సిరి పేర్కొన్నారు. ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ జిల్లాలో ప్రారంభమైందని, సీరం ఇన్స్టిట్యూట్ వారి కోవిషీల్డ్ వ్యాక్సిన్ జిల్లాకు 35,500 డోసులు వచ్చాయన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కోల్డ్ చైన్ సిస్టం పాటించడం, భద్రత ఏర్పాటు చేయడం, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని రకాల కట్టుదిట్టమైన భద్రత లతో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 26 సెషన్ సైట్లలో ఒక్కో సైట్ లో 100 మంది కి ప్రతిరోజు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తయారుచేసిన కోవిన్ సాఫ్ట్వేర్ లో మొత్తం సెషన్ సైట్ లను క్రియేట్ చేయడం, వ్యాక్సినేషన్ ఆఫీసర్ ల వివరాలు నమోదు చేయడం చేశామన్నారు. వ్యాక్సినేషన్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక్కో సెషన్ సైట్ కి మూడు రూములు ఉంటాయన్నారు. మొదటిది వెయిటింగ్ రూమ్ అని, రెండవది వ్యాక్సినేషన్ రూమ్, తర్వాత అబ్జర్వేషన్ రూములు ఉంటాయన్నారు. జిల్లాలో ఒక్కో సెషన్ సైట్ కి ఐదుగురు అధికారులు పని చేస్తున్నారన్నారు. మొదటి వ్యాక్సినేషన్ ఆఫీసర్ మహిళా పోలీస్ అని ( ఐడీ కార్డు చూసి లోపలికి పంపించడం), తర్వాత డిజిటల్ అసిస్టెంట్ ఐడి కార్డు ఉందా లేదా అని చెక్ చేసి డేటా కరెక్ట్ గా ఉందా లేదా అని చూస్తారన్నారు. అనంతరం వ్యాక్సినేషన్ రూమ్ కి వెళ్లిన వారికి వ్యాక్సినేషన్ ఇస్తారని, తర్వాత వారిని అబ్జర్వేషన్లో ఏదైనా రియాక్షన్ లు ఉన్నాయా అని పరిశీలన చేస్తారన్నారు. అనంతరం వ్యాక్సింగ్ తీసుకున్న వారిని బయటకు పంపిస్తారన్నారు. కోవిషీల్డ్ వారు తయారుచేసిన వ్యాక్సిన్ వేసుకున్నవారు మళ్ళీ 28వ రోజు రెండవసారి వ్యాక్సిన్ వేసుకోవాలని, మొదటి డోస్ వేసుకున్న వారు 2వ డోస్ కూడా అదే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ ను ఖచ్చితంగా వేసుకోవాలన్నారు. రెండవ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి 15 రోజుల అనంతరం ( మొదటి డోస్ వేసుకున్న 42 రోజుల అనంతరం) యాంటీబాడీస్ వస్తాయన్నారు. అప్పటి వరకూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఎస్ఎంఎస్ ల ద్వారా ఏ రోజు, ఏ బ్రాండ్ వ్యాక్సిన్ ను వేసుకున్నారు అనే వివరాలను పంపుతామన్నారు.
మొదటి విడతలో భాగంగా హెల్త్ వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని, రెండవ విడతలో శానిటేషన్ వర్కర్లు, పంచాయతీ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ లకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రెండవ విడతలో వ్యాక్సిన్ తీసుకొనే వారి వివరాలు, సెషన్ సైట్ ల వివరాలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఇవ్వాల్సిన శిక్షణ కూడా పూర్తయిందన్నారు. మొదటి విడతలో వ్యాక్సిన్ రియాక్షన్ పెద్దగా ఏమీ లేదని, చాలా చిన్న స్థాయి రియాక్షన్ వచ్చినా కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. గర్భవతులు, పిల్లలకు పాలిస్తున్న తల్లులూ, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్నారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు, అనంతరం ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తక్కువ సమయంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తీసుకువచ్చిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, కరోనా కట్టడి కోసం సిద్ధం చేసిన వ్యాక్సిన్ చాలా నమ్మకమైనదన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న 42 రోజుల అనంతరం వారి శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నదీమ్, డి ఐ ఓ గంగాధర్ రెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.