ఉపాది పనులకు రూ.65 కోట్లు..
Ens Balu
4
Vizianagaram
2021-01-16 20:26:55
విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ మెటీరియల్ నిధులతో చేపట్టిన కన్వర్జెన్స్ పనుల నిర్వహణలో వున్న సమస్యల పరిష్కారానికి తాను ప్రయత్నిస్తానని, క్షేత్రస్థాయిలో ఆయా పనులు ముమ్మరంగా జరిపించి పూర్తిచేయించేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాలో ఉపాధి నిధులతో కన్వర్జెన్స్ పనులను పెద్ద ఎత్తున చేపట్టినందున వాటిని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాల్సి వుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్లు డా.కిషోర్ కుమార్, జె.వెంకటరావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, గనులశాఖ అధికారులతో శనివారం సమావేశమై ఈ పనుల నిర్వహణలో వున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్సులో జిల్లాలో ఉపాధి కన్వర్జెన్సు పనులు మరింత వేగవంతం కావలసిన అవసరాన్ని తెలియజేసిన దృష్ట్యా ఈ మేరకు అధికారులతో సమావేశమై పనులను త్వరగా పూర్తిచేయడంపై దృష్టిసారించారు. జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ ఉపాధి పనులపై అధికారులు దృష్టి సారించి రోజువారీ లక్ష్యాలను నిర్ధేశించుకొని పురోగతిని సమీక్షించుకుంటేనే ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో పనులు నిర్వహించగలమని చెప్పారు.
జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన కన్వర్జెన్సు పనులకు గాను రూ.65 కోట్ల మేరకు బిల్లులు చెల్లించాల్సి వుందని ఈ మేరకు నిధులు విడుదలైతే పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం వుందని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా సచివాలయాల భవన నిర్మాణాలు, ఇతర భవనాలు ఏ స్థాయిలో ఉన్నదీ జాయింట్ కలెక్టర్(ఆసరా) వెంకటరావు వివరించారు. భవన నిర్మాణ గుత్తేదారు నిర్ణయం కాక 15 పనులు వరకు ప్రారంభం కాకుండా వున్నాయని జె.సి. వివరించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ ఎస్.ఇ. గుప్తా వివిధ నియోజకవర్గాల పరిధిలో ఈ సమస్యతో పనులు మొదలుకాని జాబితాను మంత్రికి సమర్పించారు. దీనిపై మంత్రి వెంటనే బొబ్బిలి, నెల్లిమర్ల శాసనసభ్యులకు ఫోన్ చేసి వెంటనే ఆయా నియోజకవర్గాల్లో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని లేని పక్షంలో వాటిని రద్దుచేసే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈనెల 20వ తేదీలోగా ఆయా పనులను అప్పగించేందుకు చర్యలు చేపడతామని సంబంధిత ఎమ్మెల్యేలు మంత్రికి తెలిపారు. ఉపాధి కన్వర్జెన్సు పనులకు బిల్లు బకాయిలపై ప్రభుత్వంలో మాట్లాడి వెంటనే విడుదల చేయించేందుకు చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. ఇసుక సరఫరా సమస్యలకు సంబంధించి జిల్లాలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గుర్తించిన మంత్రి ఏ.పి.ఖనిజాభివృద్ధి సంస్థ ఎం.డి. హరినారాయణ్‌తో ఫోనులో మాట్లాడి సోమవారం కల్లా జిల్లాకు శాండ్ ఆఫీసర్, సహాయ శాండ్ ఆఫీసర్లను నియమించాలని కోరారు. తెర్లాం మండలం కుసుమూరులో ఇసుక లభ్యత వున్నందున అక్కడ ఇసుక రీచ్‌కు వెళ్లడంలో ఏమైనా ఇబ్బందులు వున్నదీ లేనిదీ సబ్ కలెక్టర్ ద్వారా తనిఖీ చేయించాలని కలెక్టర్‌కు సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలోని కొండపై వున్న గ్రామాల్లో భవనాల నిర్మాణంకోసం అదనపు నిధులు మంజూరు చేసేలా గిరిజన సంక్షేమశాఖ అధికారులతో మాట్లాడతానన్నారు. ఆరోగ్య కేంద్రాలకు రూ.17.50 లక్షలు మాత్రమే అంచనా వ్యయంగా పేర్కొన్నారని, వాస్తవానికి రూ.22 లక్షల వరకు ఖర్చవుతోందని పంచాయతీరాజ్ ఎస్.ఇ. గుప్తా వివరించారు. వీటిపై కూడా అంచనాలు పెంచాల్సి వుందన్నారు.
సమావేశంలో గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకుడు మజ్జి శ్రీనివాసరావు, గృహనిర్మాణ శాఖ పి.డి. ఎస్.వి.రమణమూర్తి, గ్రామీణ నీటిసరఫరా ఎస్.ఇ. పి.రవి, ఆర్.డి.ఓ. భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.