ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తిచేయండి..
Ens Balu
0
Vizianagaram
2021-01-16 20:34:25
విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రదేశంలో ఆర్&ఆర్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్వాసిత కాలనీల్లో వసతుల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యన్నారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. సవరించిన నోటిఫికేషన్ ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 135 ఎకరాల భూ సేకరణ క్రతువు సవ్యంగా చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్, జేసీలు వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్ పోర్టు పరిధిలో జరిగే భూసేకరణ, ఆర్&ఆర్ పనులు, ఇళ్ల నిర్మాణం, డ్రెయిన్ల నిర్మాణం తదితర అంశాలపై మాట్లాడారు. ఆయా విభాగాల అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొని పలు సూచనలు, మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకున్నారు. ముందుగా భోగాపురం ఎయిర్ పోర్టు పరిధిలో నిర్వాసిత కాలనీల్లో కనీస వసతులైన రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించి వీలైనంత త్వరగా కంపనీ యాజమాన్యానికి భూమి అప్పగించే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలకు అనుగుణంగా భూమి చదును చేయాలని, హౌసింగ్ విభాగం మరియు పంచాయతీ రాజ్ విభాగాల వారు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గూడెపు వలస గ్రామంలో ఉన్న ల్యాండ్ ఫిల్లింగ్ పనులకు సంబంధించి ఉన్న సమస్యను పరిష్కరించేందుకు అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు. అక్కడ జరిగే నిర్మాణాలకు హౌసింగ్ విభాగం ద్వారా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే పోలెపల్లి గ్రామంలో ఇళ్లు, డ్రెయిన్, రోడ్లు, పాఠశాలలు, ఆలయాలు, ఎప్రోచ్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. పోలెపల్లి గ్రామం మీదుగా ఎయిర్ పోర్టు ప్రాంతానికి చేరుకొనేందుకు ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించాలని ఆదేశించారు. ఎయిర్ పోర్టు నిర్మాణం ప్రాంతంలో చెట్లు తొలగించేందుకు అనుమతులు మంజూరుకు చర్యలు తీసుకుంటానని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. పంచాయతీ రాజ్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడారు. ఆ గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక డెవలెప్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకొని పనులను సమీక్షించుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పటి వరకు పెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని.. ఈ లోగా ఇప్పటి వరకు ఉన్న నిధులతో పనులు పూర్తి చేయాలని సూచించారు. అక్కడ నిర్మించదలచిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు సాధారణ ప్రభుత్వ నిధులను వినియోగించాలని చెప్పారు.
కార్యక్రమంలో కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్, సంయుక్త కలెక్టర్లు జి.సి. కిషోర్ కుమార్, జె.వెంకటరావు, డీఆర్వో ఎం. గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, హౌసింగ్ పీడీ ఎస్.వి. రమణమూర్తి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్.ఈ. రవికుమార్, పంచాయతీ రాజ్, గనులశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.