విజయనగరంలో 15 కేంద్రాల్లో కరోనా వేక్సిన్ పంపిణీ..
Ens Balu
2
Vizianagaram
2021-01-16 20:44:24
కరోనా నుంచి విముక్తి కోసం ప్రజలంతా ఎంతగానో ఎదురుచూస్తున్న టీకాలు వేసే కార్యక్రమం శనివారం విజయనగరం జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో ప్రారంభమయ్యింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కనీసం ఒక కేంద్రం ఏర్పాటుచేస్తూ అన్ని నియోజకవర్గాల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. జిల్లాకు చెందిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నగరంలోని స్థానిక ఘోషాసుపత్రి ఆవరణలో వున్న పట్టణ కుటుంబ ఆరోగ్య కేంద్రంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సంబంధిత శాసనసభ్యులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టే విధానం గురించి వైద్యాధికారుల ద్వారా మంత్రి తెలుసుకున్నారు. అనంతరం వ్యాక్సిన్ వుండే బాక్సును జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారికి అందించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడి ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న జానకమ్మ అనే ఆరోగ్య కార్యకర్తకు తొలి టీకాను వేశారు. ఆమెను మంత్రి బొత్సతోపాటు, శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తదితరులు అభినందించారు.
ఈ సందర్బంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని 15 ఆసుపత్రుల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దీనికోసం జిల్లాకు 21,500 డోసుల వ్యాక్సిన్ వచ్చిందన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లోని వైద్య ఆరోగ్య సిబ్బందికి, వైద్యాధికారులకు ఈ టీకా వేయడం జరుగుతుందన్నారు. ఒక్కో కేంద్రం ద్వారా రోజుకు 100 మందికి టీకాలు వేసే కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని 26 వేల ఆరోగ్య సిబ్బందికి తొలిదశలో వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. తదుపరి దశల్లో పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, 50 ఏళ్లకు పైగా వయస్సు కలిగిన వారు, ఇతరులకు టీకా వేయడం జరుగుతుందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ టీకా వేస్తారని ఎవరూ ఆతృత చెందాల్సిన పనిలేదన్నారు. 18 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు, గర్భిణీలు, బాలింతలు తదితర వర్గాల వారికి మాత్రం టీకా వేయరని పేర్కొన్నారు. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు టీకాను తప్పనిసరిగా తీసుకోవలసి వుంటుందని చెప్పారు. తొలుత ఏ సంస్థ వ్యాక్సిన్‌ను వేస్తారో రెండో డోసు కూడా అదే సంస్థ వ్యాక్సిన్‌ను ఇవ్వాల్సి వుంటుందన్నారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కరోనా మహమ్మారి పారద్రోలేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామరాజు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కార్యక్రమాన్ని కూడా మంత్రి బొత్స ప్రారంభించారు. ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకుడు మజ్జి శ్రీనివాసరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.జి.నాగభూషణ రావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, భూసేకరణ ప్రత్యేక అధికారి సాల్మన్ రాజు, డిపిఓ సునీల్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సంబంధిత శాసనసభ్యులు ప్రారంభించారు. బొబ్బిలి మండలం బాడంగిలో శాసనసభ్యులు శంబంగి వెంకట చినప్పల నాయుడు, సాలూరు పరిధిలోని పాచిపెంట మండలం గురివినాయుడు వలస పి.హెచ్.సి.లో ఎమ్మెల్యే రాజన్నదొర, పార్వతీపురం మండలం జగన్నాధపురం పి.హెచ్.సి.లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు, నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి భోగాపురంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రారంభించారు.
విజయనగరంలోని పూల్ బాగ్‌లో వున్న పట్టణ ఆరోగ్యకేంద్రంలో 61 ఏళ్ల మానసిక వైద్య నిపుణుడు డా.సత్యనారాయణ డి.ఎం.హెచ్.ఓ డా. ఎస్.వి.రమణ కుమారి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. తనకు ఏ రకమైన ఆందోళన గాని సైడ్ ఎఫెక్ట్సు గాని లేవని కనీసం టీకా వేసుకున్నాననే భావన కూడా లేదన్నారు డా.సత్యనారాయణ. ప్రతిఒక్కరూ ఏమాత్రం సంకోచించకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని పేర్కొంటూ దీనిపై సందేహాలు అవసరం లేదన్నారు.
ప్రధానమంత్రి నోట... గురజాడ మాట...
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి మహాకవి గురజాడ అప్పారావు రచించిన దేశభక్తి గేయాన్ని గుర్తుచేసుకున్నారు. సొంత లాభం కొంతమానుకొని పొరుగు వారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గేయంలోని పంక్తులను చదివి వినిపించి ప్రతిఒక్కరూ తమ పొరుగువారికి ఎంతోకొంత సహాయం చేయడాన్ని అలవర్చుకోవాలని దేశప్రజలకు సూచించారు. తద్వారా మహాకవి గురజాడ ఔన్నత్యాన్ని, ఆయన రచనల విశిష్టతను దేశ ప్రజలందరికీ చేరవేశారు.