కిసాన్ రైల్ ప్రాజెక్ట్ కు స్కోచ్ అవార్డు..
Ens Balu
4
Anantapur
2021-01-16 21:03:46
ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు జిల్లాకు వరించింది. అనంతపురం నుంచి న్యూఢిల్లీకి దేశంలోనే 2వ కిసాన్ రైల్ గా వినూత్నంగా ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ ప్రాజెక్ట్ కు స్కోచ్ అవార్డు లభించిందని ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు తెలిపారు. శనివారం 70వ స్కోచ్ అవార్డుల ఎంపిక కోసం స్కోచ్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ గురుశరన్ దంజాల్, రాజ్యసభ మెంబర్ సురేష్ ప్రభు, స్కోచ్ గ్రూపు చైర్మన్ సమీర్ కొచ్చర్ లు జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, అనంతపురం నుంచి జూమ్ కాన్ఫరెన్స్లో హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు. అనంతపురం నుంచి న్యూఢిల్లీకి ఉద్యాన ఉత్పత్తులు తరలించేందుకు కోసం వినూత్నంగా కిసాన్ రైల్ ప్రాజెక్ట్ రావడానికి ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడులు ఎంతో కృషి చేశారన్నారు. కిసాన్ రైల్ కు స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కిందని, ఇందుకోసం కృషి చేసిన జిల్లా కలెక్టర్, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీఎంఐపీ పీడీ తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 161 మంది స్కోచ్ అవార్డు కోసం సెమీఫైనల్లో పోటీపడగా, ఫైనల్లో మిగిలిన 20 మందిలో మన జిల్లా నుంచి కిసాన్ రైలు ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా మాత్రమే స్కోచ్ అవార్డు జాబితాలో ప్రథమంగా ముందంజలో నిలిచామని తెలిపారు. స్కోచ్ అవార్డు ఎంపిక కోసం ఆన్లైన్ ఓటింగ్ లో పెనుగొండ హార్టికల్చర్ ఏ డి చంద్రశేఖర్, ఇతర సిబ్బంది పాల్గొని సిల్వర్ స్కోచ్ అవార్డు దక్కేందుకు ఎంతో కృషి చేశారన్నారు. స్కోచ్ అవార్డు వచ్చేలా రైతులు, టమోటా మండి మార్కెట్ యజమానులు, హార్టికల్చర్ అధికారులు, సిబ్బంది ఎంతగానో కష్టపడి పని చేశారని, వారికి అభినందనలు తెలియజేశారు. జూమ్ కాన్ఫరెన్స్లో ఏపీ డి లు నరసింహరాజు ఫిరోజ్, సూపరింటెండెంట్ ప్రసాద్ లు పాల్గొన్నారు.