రామతీర్థలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్..
Ens Balu
2
Nellimarla
2021-01-17 20:56:53
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని సీతారామ కోనేరు చెంతన జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. హరిత విజయనగరం, చేయూత ఫౌండేషన్ సొసైటీ, ఎన్.వి.వి. సొసైటీ బృంద సభ్యులతో కలిసి 150 ఆక్సీజన్ (క్రోటాన్) మొక్కలు నాటి నీరు పోశారు. చుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం చెంతన ఉన్న సీతారామ కొనేరును సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కోనేరు అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. త్వరలో చుట్టూ దేవతా వృక్షాలను పెంచాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని హరిత విజయనగరం బృంద సభ్యులకు, స్థానిక ఎంపిడిఓ కు సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మొక్కల పెంపకం వల్ల స్వచ్ఛమైన గాలి, నీరు లభిస్తుందని తద్వారా మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. గ్రామ పరిసరాలను, చెరువులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందన్నారు. చెరువుల్లో వ్యర్థాలు వేసి కలుషితం చేయవద్దని చెప్పారు. ఈ సందర్భంగా మొక్కలు స్పాన్సెర్ చేసిన శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ ఎ.శ్రీ రామమూర్తిని కలెక్టర్ అభినందించారు.
కార్యక్రమంలో డి.ఎఫ్.వో. బి.జానకీ రావు, హరిత విజయనగరం కో - ఆర్డినేటర్ ఎం. రామ్మోహన్ రావు, నెల్లిమర్ల ఎంపిడిఓ కె. రాజ్ కుమార్, తహశీల్దార్ జి. రాము, చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.రాము, ఉపాధ్యక్షురాలు ఎల్.సంధ్య, ఎన్.వి.వి. సొసైటీ అధ్యక్షురాలు జి.విశాలాక్షి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అధ్యక్షులు ఎస్.అచ్చిరెడ్డి, డా.వెంకటేశ్వరరావు, రామతీర్థం ఆలయ ఈవో, ఎన్.ఆర్.జి.ఎస్., వెలుగు, సచివాలయ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.