జర్నలిస్టుల సమస్యలపై SCRWA సమరం..


Ens Balu
3
Visakhapatnam
2021-01-17 21:06:02

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రత్యేక పోరాటం చేపడుతుందని  అధ్యక్షులు బంగారు అశోక్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల మనుగడకే ముప్పు వాటిల్లుతున్న తరుణంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జర్నలిస్టుల తరపున పోరాటం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులతోపాటు, సమాచార శాఖ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని కమిటీలో నిర్ణయించామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంతోపాటు, వారి సమస్యలపైనా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాటం చేస్తుందన్నారు. జర్నలిస్టుల ప్రాధమిక హక్కు అయిన అక్రిడిటేషన్ విషయంలో దేశరాజధాని ఢిల్లీలోని పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)లో కూడా లేని నిబంధనలు రాష్ట్రప్రభుత్వంలోని సమాచార శాఖ అమలు చేయాడం వలన చాలా మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అక్రిడిటేషన్లు మంజూరు అయ్యేంత వరకూ తమ పోరాటం ఆపేది లేదని అశోక్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రతీ జర్నలిస్టు నడుం బిగించాలని అశోక్ పిలుపునిచ్చారు.