ట్రాఫిక్ పై అవగాహనతో ప్రమాదాల నివారణ..
Ens Balu
1
Srikakulam
2021-01-18 13:56:09
రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబరులో 32వ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టరును విడుదల చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లకు ముఖ్యంగా యువతకు రహదారి భద్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. కాలేజీలు, విద్యాసంస్థలలో విద్యార్ధులకు సైతం అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ట్రక్ డ్రైవర్లను సైతం భాగస్వాములను చేయనున్నామన్నారు. జిల్లాలో 120 కి.మీ.ల హైవే వున్నదని, రహదారి ప్రమాదాలలో ప్రాణ నష్టం జరుగకూడదని, ఇందు నిమిత్తం ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి వుండడంతో పాటు నిబంధనలను పాటించాలని అన్నారు.
రవాణా శాఖ ఉప కమీషనరు డా. వి.సుందర్ మాట్లాడుతూ, ప్రతీ ఏటా రహదారి ప్రమాదాల నివారణపై నెల రోజుల పాటు రహదారి మాసోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. ప్రమాదాలలో జీవితాలను కోల్పోయే పరిస్థితులు రాకూడదన్నారు. ప్రజలకు రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కలిగించవలసి వుందన్నారు. ఆటో డ్రైవర్లకు, కాలేజీ విద్యార్ధులకు రహదారి భద్రతపై అవగాహన కలిగిస్తామని, డ్రైవర్లకు హెల్త్ చెక్ అప్ చేస్తామని తెలిపారు. బి.పి., షుగర్, కంటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు నెల రోజుల పాటు రహదారి ప్రమాదాలపై రోజు వారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం, *సురక్షితమైన రహదారి మీ జీవితానికి రక్ష* అనే నినాదంతో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రహదారి భద్రతపై పోస్టర్లను, ఫాంఫెట్లను విడుదల చేసారు.
ఈ కార్యక్రమానికి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎం.వేణుగోపాల రావు, ప్రసాద రెడ్డి, సాయిరామ్, శశి, పి.శివరాం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.