20లోగా ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తికావాలి..
Ens Balu
4
Kakinada
2021-01-18 14:56:35
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఈ నెల 20వ తేదీ నాటికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని 100 శాతం పూర్తిచేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి తదితరులతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజనల్, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్ననవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరుగుతున్న పట్టాల పంపిణీపై మంగళవారం నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వలంటీర్లు, వీఆర్‌వోలు, సంక్షేమ కార్యదర్శులు ఇలా ఈ కార్యక్రమంతో సంబంధమున్న సిబ్బందిలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన రేషన్ సరకుల పంపిణీ వాహనాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం ప్రతి వాహనానికి ప్రత్యేకంగా ఓ నోడల్ వీఆర్‌వోను అనుసంధానించినట్లు తెలిపారు. సిబ్బందికి సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. జిల్లాలో ప్రభుత్వం తొలుత 968 బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటికోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష పథకం కింద భూముల రీసర్వే ప్రక్రియ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశానికి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.