21న మొబైల్ వాహనాలు ప్రారంభం..


Ens Balu
3
Kakinada
2021-01-18 15:59:34

ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీకి ఈ నెల  21న మొబైల్ డిస్పెన్సరీ వాహనాలు ప్రారంభించనున్నామని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీ శ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి లతో కలిసి మొబైల్ డిస్పెన్సరీ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ లో భాగంగా ఇంటివద్దకే ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నదన్నారు.21 న రాష్ట్రస్థాయిలో వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన అనంతరం జిల్లాలో కూడా ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దూర ప్రాంతంలో నుంచి వచ్చే వాహనాల లబ్ధిదారులు 20వ తేదీ మధ్యాహ్నం నాటికి కాకినాడ చేరుకోవాలని ఆయన సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గం, మండలాల వారిగా వరుసక్రమంలో వాహనాలు ఏర్పాటు,వాహనాలు మండలాలకు తరలింపులో అవసరమైన రూట్ మ్యాప్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సక్రమంగా అన్నీ ఏర్పాట్లు చేయాలన్నారు. మొబైల్ వాహనాలు మండలాలకు చేరి,లబ్ధిదారులకు ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వాహన ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఆయా మండలాల తహసీల్దార్లు పర్యవేక్షణలో మండల హెడ్ కోటర్స్ కు వాహనాలు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.