విజయనగరం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం భేష్..
Ens Balu
5
Vizianagaram
2021-01-18 16:09:22
విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయం పట్ల రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ టి.విజయకుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆయన వెళ్లడించారు. ఐక్యరాజ్యసమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి తో కలిసి ఆయన మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించి, ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించారు. రైతులతో మమేకమై, వారి అభిప్రాయాలను, అనుభవాలను తెలుసుకున్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడమే కాకుండా, స్వయంగా తన క్యాంపు ఆఫీసు ఆవరణలో సైతం ప్రకృతి సేద్యం చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్‌తో సోమవారం ఉదయం విజయ్‌కుమార్, త్రిపాఠి భేటీ అయ్యారు. క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రకృతి సేద్యాన్ని పరిశీలించి, అభినందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విజయకుమార్ వెళ్లడించారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ విధానాన్ని రైతుకు చేరువ చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయల సాగును ప్రోత్సహించి, ప్రతీ రైతు బజార్‌లో ప్రత్యేకంగా కూరగాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, వారు కలెక్టర్ ను కోరారు. అనంతరం ఎల్‌కోట మండలం మార్లపల్లి వెళ్లి, ప్రకృతి వ్యవసాయం ద్వారా చిరుధాన్యాలను సాగు చేస్తున్న రైతులతో సమావేశమయ్యారు. వారికి పలు సలహాలు సూచనలు అందజేశారు.
జిల్లా పర్యటనలో భాగంగా విజయకుమార్, త్రిపాఠి ఈ నెల 16వ తేదీన వేపాడ మండలంలో బైలాజికల్ లేబ్‌ను, సేంద్రీయ వస్తువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 17వ తేదీన కురుపాం, జిఎల్‌పురం మండలాల్లోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పలు గ్రామాలను వారు సందర్శించారు. 43 గ్రామాలను శతశాతం ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా ప్రకటించారు. సాగు చేస్తున్న రైతులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ పర్యటనలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.ఆశాదేవి, నేచురల్ ఫార్మింగ్ ఏడి ప్రకాశరావు, ఏఓ హేమసుందర్, ఆయా మండలాల వ్యవసాయాధికారులు, ఏడిఏలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.