21న రేషన్ రవాణా ట్రక్కుల పంపిణీ..
Ens Balu
2
Srikakulam
2021-01-19 18:54:33
శ్రీకాకుళం జిల్లాలో రేషన్ సరుకుల రవాణా ట్రక్కుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 21న జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. రవాణా ట్రక్కుల పంపిణీ జరగనున్న కోడి రామమూర్తి స్టేడియంను మంగళవారం ఉదయం జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రవాణా ట్రక్కుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పారు. ఉదయం11 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. జిల్లాలో 530 ట్రక్కులను పంపిణీ జరుగుతుందని, వాహనాలు ఆర్.టి.సి కాంప్లెక్స్, బలగ, రిమ్స్ రహదారి గుండా వాహనాలు ఊరేగింపుగా వెళ్ళి అర్ట్స్ కళాశాల మీదుగా మరల కోడి రామమూర్తి స్టేడియం చేరుకుంటాయని ఆయన వివరించారు. రవాణా ట్రక్కులతో ఫిబ్రవరి 1వ తేదీ నుండి రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణీ జరుగుతుందని తెలిపారు. 21వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం 22, 23 తేదీల్లో సంబంధింత మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓల పర్యవేక్షణలో మండలాలకు చేరుకుంటుంది చెప్పారు. 27 నుండి 30వ తేదీ వరకు మండలాల్లో రూట్లను పరిశీలించి అవగాహన పొందుతారని తెలిపారు. ఇప్పటికే ట్రయల్ రన్ జరుగుతుందని అన్నారు. 20వ తేదీన వాహన లబ్ధిదారులకు ఉదయం 9 గంటల నుండి జిల్లా పరిషత్ లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 530 వాహనాలకు గాను 4 వందల మంది బిసి, 14 మంది ఓబీసీ లబ్ధిదారులు, 72 మంది ఎస్సీ, 43 మంది ఎస్టీ, ఒక మైనారిటీ లబ్దిదారు ఉన్నారని వివరించారు.
జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఒక రవాణా వాహనం రోజుకు 90 గృహాలకు రేషన్ సరఫరా చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఒక వాహనాన్ని 2 చౌక దుకాణాలు, ఒక గ్రామ సచివాలయానికి అనుసంధానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఒక వాహనం సరాసరిన 18 రోజుల పాటు పనిచేయనుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్, డిఎస్పీ సి హెచ్ జీవికె ప్రసాద్, బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి కె.రామారావు, డిఎస్ఓ డి.వి.రమణ, పౌర సరఫరాల సంస్థ డిఎం ఏ.కృష్ణారావు, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ పి.నల్లనయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, ఉద్యాన సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.