రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి..


Ens Balu
3
Srikakulam
2021-01-19 18:59:04

శ్రీకాకుళం జిల్లాలో రేషన్ డీలర్లు సరుకులను సకాలంలో కార్డుదారులకు అందజేయాలని, అలాగే డీలర్లు లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి వీలైనంత వరకు పరిష్కరించేందుకు కృషిచేస్తామని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జె.సి అధ్యక్షతన శ్రీకాకుళం జిల్లా రేషన్ డీలర్ల సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ  జిల్లాలోని రేషన్ డీలర్లు లేవనెత్తిన స్టాక్ బ్యాలెన్స్ కు, ఇ-పాస్ లోని బ్యాలెన్స్ కు వ్యత్సాసానికి గల కారణాలను పరిశీలిస్తామని చెప్పారు. అలాగే వాలంటీర్ల పొరపాట్ల వలన డీలర్లకు అన్యాయం జరుగుతుందనే విషయమై పరిశీలిస్తామని అన్నారు. జిల్లాలో నిజాయితీగా పనిచేసే డీలర్లను అభినందిస్తూనే , తప్పుడు లెక్కలు చూపే డీలర్లపై చర్యలు తప్పవని స్పష్టం చేసారు. రేషన్ డీలర్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టాలని,  డీలర్ల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వ నిర్ణయం మేరకు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషిచేస్తామని చెప్పారు.          ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు,  జిల్లా పౌర సరఫరాల అధికారి డి.వి.రమణ , శ్రీకాకుళం జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్.సూర్యారావు, ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి వి.భాస్కరరావు, కోశాధికారి కె.సత్యనారాయణ, డీలర్లు గంగు శిమ్మయ్య, వై.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.