ఎన్నికల సంఘం అవార్డుకి కలెక్టర్ హరిజవహర్ లాల్..
Ens Balu
1
Vizianagaram
2021-01-19 19:43:49
ప్రభుత్వ కార్యక్రమాలను, సామాజిక కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ పలు సంస్థల నుండి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ మరో అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఇచ్చే అవార్డులకు జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా కేంద్ర ఎన్నికల సంఘం అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సి.ఇ.ఓ. కార్యాలయం నుండి జిల్లా యంత్రాంగానికి సమాచార అందింది. తన నాయకత్వ ప్రతిభతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలుచేసి ఓటర్ల జాబితాలో సవరణలకు సంబంధించిన వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించడం, రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు చర్చించి వారికి తెలియజేసి వారి సహకారంతో జిల్లాలో ఎన్నికల జాబితా సవరణలు పకడ్బందీగా చేపట్టడం, ప్రతి నెల క్రమం తప్పకుండా ఇ.వి.ఎం.ల గోదాముల్ని తనిఖీచేసి ఓటింగ్ యంత్రాల భద్రతను పర్యవేక్షించడం, బి.ఎల్.ఓ. నియామకాలు చేపట్టి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఇప్పటికే ఈ ఏడాది కేంద్ర జలశక్తి శాఖ నుండి జల సంరక్షణ అవార్డు, స్కోచ్ అవార్డులు వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కైవసం చేసుకున్న జిల్లా కలెక్టర్ ఈసారి రాజ్యాంగ బద్ద సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం నుండి ప్రతిష్టత్మక అవార్డు అందుకోనున్నారు. విజయవాడలో ఈనెల 25న ఈ అవార్డు అందజేస్తారు.
ఎన్నికల సంఘం అవార్డుకు ఎంపికైన జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్‌ను జాయింట్ కలెక్టర్‌లు డా.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, జె.వెంకటరావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, పశుసంవర్ధక శాఖ జె.డి. ఎం.వి.ఏ.నర్శింహులు, సమాచార శాఖ ఏ.డి. డి.రమేష్, ఎన్.జి.ఓ. జగదీష్‌బాబు, కలెక్టర్ కార్యాలయ ఏ.ఓ. సూపరింటెండెంట్‌లు, ఉద్యోగులు అభినందించి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. జిల్లా కలెక్టర్ నాయకత్వ ప్రతిభకు నిదర్శనంగా ఈ అవార్డు నిలుస్తుందని జె.సి. డా.కిషోర్ కుమార్ అన్నారు.