ప్రతీ నిరుపేదకు సొంతిల్లు దక్కాలి..
Ens Balu
3
Peddapuram
2021-01-19 20:19:50
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాను అందుకున్న లబ్ధిదారునితో జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి సచివాలయం నుండి ఫోన్ ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం పెద్దాపురం పట్టణం గౌరీకోనేరు 1,2 వార్డు సచివాలయాలను ఆర్డీవో ఎస్.మల్లిబాబు, మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్రలతో కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో వార్డు వాలంటీర్ ఫోన్ ద్వారా పేదలందరికీ ఇళ్లు లో ఇంటి పట్టాను అందుకున్న లబ్దిదారు లక్ష్మీకి ఫోన్ చేయగా ఆమె భర్తతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్దిదారు పేరు, సొంతిల్లు ఉన్నదా, ఏం పని చేస్తారు, అద్దె ఇంట్లో వుంటున్నారా, గృహ నిర్మాణానికి ఆప్షన్ ఇచ్చారా అని లక్ష్మి భర్తను అడుగగా సొంతిల్లు లేదని, ఇళ్ల పట్టా అందిందని, సూరంపాలెంలో వాలంటీర్ ప్లాటు చూపించారని, గృహ నిర్మాణానికి ప్రభుత్వమే కట్టించి ఇచ్చేలా ఆప్షన్ ఎంచుకోవడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. అనంతరం పేదలందరికీ ఇళ్లలో ఎంతమంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు కాబడినవి, ఎంతమందికి పట్టాలు పంపిణీ చేయబడినవి, ఎన్ని పట్టాలు పెండింగ్ లో వున్నవి, పెండింగ్ కు గల కారణాలు, డాష్ బోర్డు వివరాలను వార్డు సచివాలయ సెక్రటరీలను, వాలంటీర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగి ,18 సంవత్సరాలు నిండి వివాహం కాబడిన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల పట్టాను మంజూరు చేయాలని తెలిపారు.అదేవిధంగా లబ్దిదారుల ఇళ్ల పట్టాలు ఎట్టి పరిస్థితుల్లోను వాలంటీర్ వద్ద ఉంచుకోవద్దని, లబ్దిదారులకు ఫోన్ చేసి పట్టాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి మంజూరు కాబడిన లబ్దిదారుల వివరాలు, తిరస్కరణకు గురైన దరఖాస్తులు, తిరస్కరణకు గల కారణాలు, తదితర వివరాలను నూరు శాతం పక్కాగా రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా లబ్దిదారులకు సంబంధించి గృహ నిర్మాణ ఆప్షన్ల వివరాలను, టిడ్కో లబ్దిదారుల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సచివాలయ నిర్వహణ, పనితీరు పై ఈ సందర్భంగా కలెక్టర్ సంతృప్తి వెలిబుచ్చారు.
ఈ పరిశీలనలో తహశీల్దార్ బి.శ్రీదేవి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దావీదురాజు, ఆర్ ఐ రాఘవ, మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.