రేషన్ సరుకులు ప్రజా పంపిణీకి సర్వం సిద్దం..
Ens Balu
3
Kakinada
2021-01-19 20:24:50
మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ బియ్యం నేరుగా లబ్దిదారుని ఇంటి వద్దకే ఈ నెల 21వ తేదీన చేపట్టే కార్యక్రామానికి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మిశ(రెవెన్యూ), కీర్తీ చేకూరి (అభివృధ్ధి), జి.రాజకుమారి (సంక్షేమం), కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిక్ దిన్కర్ పుండ్కర్ ఇతర అధికారులతో కలిసి కాకినాడ క్రీడా ప్రాంగణం, జే.ఎన్.టి.యు.ప్రాంతాన్ని సిధ్ధంగా ఉన్న వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన రాష్ట్ర స్ధాయిలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన రెడ్డి ఈ వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అదే సమయంలో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వద్ద జిల్లాలో ఈ వాహనాలను ప్రారంభించే విధంగా సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో 19 నియోజకవర్గాల పరిధిలో అన్ని మండల, మున్సిపాలిటీలకు 1076 వాహనాలు చేరే విధంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 21వ తేదీ ఉదయం ఈ వాహనాలు జిల్లా క్రీడా ప్రాంగణం నుండి బయలుదేరి నాగమల్లితోట మీదుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని అయప్ప దేవాలయం వద్ద యు-టర్న్ తీసుకొని రంగరాయ మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకొంటాయన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన సభా స్ధలి వద్ద మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. అక్కడ జెండా ఊపి వాహనాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ వాహనాలు అక్కడ నుండి బయలుదేరి సర్పవరం జంక్షన్ కు చేరుకుంటాయన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద నియోజకవర్గానికి కేటాయించిన ఆయా వాహనాలను మండలాల వారీగా రెవెన్యు అధికారులు స్వాధీనం చేసుకొని అక్కడ నుండి బయలుదేరి వెళతారు. ఈ కార్యక్రమాన్ని అంతటినీ జిల్లా స్ధాయి సివిల్ సప్లయిస్ అధికారులు , సబ్ కలెక్టర్లు , రెవెన్యూ డివిజనల్ అధికారులు పర్యవేక్షిస్తారని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి. కరణం కుమార్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, డిఎస్ఓ ప్రసాద్, సివిల్ సప్లయిస్ డియం ఇ.లక్ష్మారెడ్డి, వాహన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.